
అధిక వర్షాలతో తగ్గిన బొగ్గు ఉత్పత్తి
రెబ్బెన: గత నెలలో కురిసిన అధిక వర్షాలతో బెల్లంపల్లి ఏరియాలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి సాధించలేకపోయామని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. బుధవారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌లో ఏరియాకు 2లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేషించగా అధిక వర్షాల కారణంగా ఓసీపీలో ఉత్పత్తి ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడి కేవలం 74 వేల టన్నులు మాత్రమే సాధించామన్నారు. దీంతో కేవలం 37 శాతం ఉత్పత్తిని మాత్రమే సాధించామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఏరియాలో మోతాదుకు మించి వర్షాలు కురిసాయన్నారు. గతేడాది ఈ సమయానికి 1,207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈసారి 1,829 నమోదైందన్నారు. గడిచిన మూడు నెలల్లో 93 రోజుల్లో 64 రోజులు వర్షాలే పడ్డాయని మిగిలిన 29 రోజుల్లో మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేయగలిగామన్నారు. అయినప్పటికీ ఉత్పత్తి, ఉత్పాదకతలో ఏరియా 83 శాతంలో ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ వర్షాలతో కోల్పోయిన ఉత్పత్తిని సాధించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్ బెహారా, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.