
అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలి
ఆసిఫాబాద్‌అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ముమ్మర తనిఖీలు నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పరిసరాల శుభ్రత, సిబ్బంది కిట్ ఆర్టికల్స్, సీజ్ చేసిన క్రైమ్ వెహికిల్స్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డ్‌ని తనిఖీ చేస్తూ, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను ఎస్‌హెచ్‌ఓను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతీ కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ బాధితులకు అండగా నిలవాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల నిషేధిత పదార్థాలు, అక్రమ మద్యం, రవాణా, అక్రమ డబ్బుల చలామణిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గ్రామాల్లో చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనిస్తూ ఉండాలన్నారు. సైబర్ నేరాల అదుపునకు విద్యాసంస్థల్లో, పనిస్థలాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విధుల పట్ల అంకిత భావంతో పని చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం స్టేషన్ పరిధిలో మొక్కలు నాటారు. ఆయన వెంట ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ బాలాజీ వరస్రసాద్, ఎస్సైలు ఉన్నారు.