
పత్తిలో మత్తు పంట
మారుమూల ప్రాంతాల్లో యథేచ్ఛగా గంజాయి సాగు అత్యాశతో పండిస్తున్న కొందరు రైతులు కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
కెరమెరి మండలం ఇందాపూర్ గ్రామానికి చెందిన వాడాయి పోశెట్టి పత్తి చేనులో అంతర పంటగా గంజాయి సాగు చేశాడు. పక్కా సమాచారంతో పోలీసులు సెప్టెంబర్ 23న పొశెట్టి పత్తి చేనును తనిఖీ చేశారు. రూ.13 లక్షల విలువైన 130 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కెరమెరి ఎస్సై మధుకర్ గంజాయి సాగు చేసిన పొశెట్టిపై కేసు నమోదు చేశారు.
జైనూర్ మండలం జాడుగూడ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మణ్ తన వ్యవసాయ క్షేత్రంలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. ముందస్తు సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. పది మొక్కలను స్వాధీనం చేసుకుని లక్ష్మణ్‌పై కేసు నమోదు చేశారు.
కౌటాల(ఆసిఫాబాద్): తక్కువ సమయంలో ఎక్కు వ డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొందరు గంజాయి సాగు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పత్తి చేలలో అంతర పంటగా పండిస్తున్నారు. అడపాదడపా పోలీసుల ఆకస్మిక తనిఖీ లు చేపడుతుండగా భారీగా గంజాయి పట్టుబడుతోంది. మొక్కలను ధ్వంసం చేసి నిందితులపై కేసు నమోదు చేస్తున్నారు. సాగు చేస్తున్న వారిలో చాలా మంది దళారులకు విక్రయిస్తున్నారు. కొంతమంది మాత్రం మహారాష్ట్ర, హైదరాబాద్, ఇతర ప్రాంతా లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో విచ్చలవిడిగా అందుబాటులో ఉండడంతో యువత మత్తుకు బానిసలవుతున్నారు.
విచ్చలవిడిగా వినియోగం..
గంజాయి సాగు చేసి సొమ్ము చేసుకునే అవకాశం ఉండటంతో అక్రమార్కులు దందాను కొనసాగిస్తున్నారు. దీనికి తోడు గంజాయి విక్రయదారులపై పోలీసుల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు కాగజ్‌నగర్ పట్టణం, మండల కేంద్రాల్లో రాత్రివేళల్లో కొంతమంది యువత మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా జైలు శిక్ష, జరిమానాతోపాటు నార్కోటిక్ చట్టం ప్రకారం 30 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. తక్కువ మోతాదులో రవాణా చేస్తే ఏడాది జైలుతో పాటు 20 కిలోలు లభిస్తే దాదాపు ఐదేళ్ల నుంచి 20 ఏళ్ల శిక్ష పడుతుంది. రూ.25 వేలకు పైగా జరిమానా కూడా విధిస్తారు. పంట భూముల్లో సాగుచేస్తే వారికి సంక్షేమ పథకాలు రద్దు చేస్తారు.
కేసులు నమోదు చేస్తాం
గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా చర్యలు తప్పవు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం. యువత మత్తుకు బానిసై తమ జీవితాలు నాశనం చేసుకోవద్దు. పిల్ల ల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలి. పోలీసులకు ప్రజలు సహకరించాలి. రైతులు, యువతకు అవగాహన కల్పిస్తున్నాం.
– ఎండీ వహీదుద్దీన్, కాగజ్‌నగర్ డీఎస్పీ
అంతర పంటగా సాగు
అడువుల జిల్లా ఆసిఫాబాద్‌లో మారుమాల ప్రాంతాలు అధికం. దీంతో కొందరు అత్యాశతో.. మరి కొందరు ఎవరికి తెలియదనే ధీమాతో గంజాయి సాగు చేస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నా పరిస్థితుల్లో మార్పు రావడంలేదు. కొందరు ఏళ్లుగా అక్రమ దందాను వృత్తిగా చేసుకుంటున్నారు. పత్తి, కంది, సోయా ఇతర పంట చేలలో అంతర పంటగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారు. సిర్పూర్(యూ), జైనూర్, కెరమెరి, చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్, వాంకిడి, కాగజ్‌నగర్, రెబ్బెన మండలాల్లో అత్యధికంగా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పండించిన పంట హైదరాబాద్ వంటి ప్రాంతాలకు సరఫరా అవుతోంది. పోలీసు శాఖ అప్పుడప్పుడు తనిఖీలు చేపట్టడం మినహా ఆబ్కారీ శాఖ అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పోలీసులు ఈ ఏడాది ఇప్పటివరకు రూ.41.21 లక్షల విలువైన గంజాయిని పట్టకున్నారు. గంజాయి సాగు చేస్తే సంబంధిత రైతుకు వచ్చే ప్రభుత్వ పథకాలను నిలిపేస్తామని హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు.

పత్తిలో మత్తు పంట

పత్తిలో మత్తు పంట