
ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌తో కలిసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికల నిర్వహణపై అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో 15 జెడ్పీటీసీలు, 127 ఎంపీటీసీలు, 335 సర్పంచులు, 2,874 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ విడుదల చేసిందన్నారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతి, సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అంశాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డీటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నగదు, మద్యం, చీరల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతి, డీఆర్‌డీవో దత్తారావు, డీపీఆర్వో సంపత్‌కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నదీమ్, ముఖ్యప్రణాళిక అధికారి వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.
సర్వేలెన్స్ బృందాల ఏర్పాటు
ఎన్నికల నిర్వహణలో భాగంగా సర్వేలెన్స్ బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు నోడల్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మ్యాన్ పవర్, హెల్ప్‌లైన్ ఫిర్యాదుల పరిష్కారాలు, రవాణా, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికల సామగ్రి నిర్వహణ, ఖర్చుల పర్యవేక్షణ నిర్వహణ, పరిశీలకులు, బ్యాలెట్ పేపర్, బాక్సుల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించామని పేర్కొన్నారు.