
రైలు పట్టాలు!
మంచిర్యాల, సిర్పూర్(టి) స్టేషన్ల మధ్య పెరిగిన ప్రమాదాలు ఆత్మహత్యలకు నిలయాలుగా ట్రాక్‌లు ఈ ఏడాది వివిధ కారణాలతో 139 మంది మృతి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రయాణికుల విన్నపం
రక్తమోడుతున్న
ఈ నెల 22న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి కుటుంబ కలహాలతో కాగజ్‌నగర్ పట్టణంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. వీరి కుటుంబం 20 రోజుల క్రితం పట్టణ శివారులోని ఓ ఇటుక బట్టిలో పనిచేసేందుకు వచ్చింది. కాగజ్‌నగర్ మండలం చింతగూడ గ్రామ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 22న ఆత్మహత్య చేసుకునేందుకు చింతగూడ రైల్వే క్రాసింగ్ వద్దకు స్వప్న తన కుమార్తె జాస్మితో కలిసి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త జగత్‌రాం వారిని ఆపేందుకు ప్రయత్నించాడు. గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో తల్లీకుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. జగత్‌రాంకు తీవ్ర గాయాలయ్యాయి. ఇలా.. రైలు పట్టాలు ప్రమాదాలు, ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయి.
కాగజ్‌నగర్‌టౌన్: మంచిర్యాల నుంచి సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ల మీదుగా నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 27 వరకు మంచిర్యాల జీఆర్పీ పోలీస్టేషన్ పరి ధిలోని పట్టాలపై పడి, ఆత్మహత్య చేసుకుని, రైలు పట్టాలు దాటుతూ, రైలు నుంచి జారిపడి వంటి కారణాలతో 139 మరణాలు నమోదయ్యాయి. పట్టాలు దాటుతూ, రైలు నుంచి జారిపడి 29 మంది గాయాల పాలయ్యారు. పట్టాలపై ప్రమాదాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, క్షణాకావేశంలో విలువైన ప్రాణాలను పట్టాలకు బలిస్తున్నారు. మరికొందరు ప్రమాదవశాత్తు వెళ్తున్న రైలు నుంచి జారిపడి, అజాగ్రత్తతో పట్టాలు దాటుతూ మృతి చెందుతున్నారు. కారణాలు ఏవైనా రైలు పట్టాలపై ప్రజల ప్రాణాలు పోతున్నాయి.
రద్దీ అధికం..
కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలో మంచిర్యాల, మందమర్రి, రవీంద్రఖని, బెల్లంపల్లి, రేచినీరోడ్, ఆసిఫాబాద్ రోడ్, సిర్పూర్ కాగజ్‌నగర్, సిర్పూర్(టి) రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ల నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు నాగ్‌పూర్, సికింద్రాబాద్‌తోపాటు దూరప్రాంతా లకు రాకపోకలు సాగిస్తుంటారు. దసరా, దీపావళి పండగల సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ స్టేషన్ల నుంచి ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్, రాజస్థా న్, మధ్యప్రదేశ్, బీహార్, నాగ్‌పూర్, హైదరాబాద్, విజయవాడ, కాజిపేట్, ఢిల్లీ, తదితర ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వందేభారత్, అమృత్‌భారత్‌తో పాటు పలు రైళ్లకు రెండు జిల్లాల్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించింది. దీంతో రద్దీ పెరిగింది.
నిర్లక్ష్యంతో ప్రమాదాలు
గమ్యం చేరుకోవాలనే తొందరలో ప్రయాణికులు పొరపాట్లు చేస్తుంటారు. రైలు వచ్చే సమయాల్లో హడావుడిగా ప్లాట్‌ఫాంపై పరిగెడుతూ, రైలు ఎక్కుతున్న సమయాల్లో, ఫుట్‌బోర్డుపై కూర్చొని ప్ర యాణం చేస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నా రు. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మంచిర్యాల– సిర్పూర్ (టి) రైల్వే స్టేషన్ల పరిధిలో ఎక్కువగా మంచిర్యాల గోదావరి బ్రిడ్జి, మందమర్రి సమీపంలోని వాగు, బెల్లంపల్లి రైల్వేస్టేషన్ నాలుగు కిలోమీటర్ల దూరం మధ్య, అలాగే రాళ్లపేట రైల్వే క్యాబిన్ సమీపంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కుమురంభీం జిల్లాలో ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్ పరిధి లోని పెద్దవాగు సమీపంలో, కాగజ్‌నగర్ పట్టణంలోని సంజీవయ్య కాలనీ సమీపంలో పట్టాలు దాటుతూ ప్రమాదాల బారినపడుతున్నారు. చింతగూడ రైల్వేగేటు సమీపంలో పట్టాలు దాటుతుండగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
జాగ్రత్తలు పాటించాలి
ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించే సమయంలో స్వీయ జాగ్రత్తలు పాటించాలి. గమ్యాన్ని చేరుకోవాలనే తొందరలో పట్టాలు దాటి విలువలైన ప్రాణాలు బలి చేసుకోవద్దు. ప్రయాణానికి 15 నిమిషాలు ముందు స్టేషన్‌కు చేరుకోవాలి. రైల్వే పోలీసుల ఆధ్వర్యంలో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాం.
– మహేందర్,
జీఆర్పీ ఎస్సై, మంచిర్యాల రైల్వేస్టేషన్
ఫ్లైఓవర్ బ్రిడ్జికి మెట్లు లేక..
కాగజ్‌నగర్ పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా ప్రయాణికులు ఎక్కేందుకు మెట్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టణంలోని కాపువాడ, సీబాపుకాలనీ, మారుతినగర్, లక్ష్మినగర్, జీడిచేను, భట్టుపల్లి గ్రామాల ప్రజలు నడుచుకుంటూ పట్టాలు దాటుతున్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా మెట్లు లేకపోవడంతో రైలు రాకను గుర్తించకలేకపోతున్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా మెట్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.