
సాయిరాం సాధించాడు..
కౌటాల(సిర్పూర్): సాధించాలనే తపన ఉంటే పేదరికం అడ్డుకాదని నిరూపించారు కౌటాల మండలం తలోడి గ్రామానికి చెందిన సాయిరాంగౌడ్. పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్– 2 ఫలితాల్లో మెరిశారు. కౌటాల మండలం తలోడి గ్రామానికి చెందిన మండల రాజేశంగౌడ్, తారక్క దంపతులకు ఇద్దరు సంతానం. తారక్క గృహిణి కాగా రాజేశంగౌడ్ గీత కార్మికుడిగా పనిచేస్తూ పిల్లలను చదివించారు. వారి కుమారుడు సాయిరాంగౌడ్ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశారు. తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనే పట్టుదలతో తొలి ప్రయత్నంలోనే పంచాయతీ కార్యదర్శిగా కొలువు సాధించారు. ప్రస్తుతం బెజ్జూర్ మండలం మొగవెల్లి పంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ వైపు కార్యదర్శిగా పనిచేస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. గ్రూపు– 2 పరీక్షలకు హాజరై 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 191వ ర్యాంకు సాధించారు. మండల పంచాయతీ అధికారి(ఎంపీఓ)గా ఉద్యోగం పొందారు. గ్రూప్– 1 మెయిన్స్‌లో 436 మార్కులు రాగా, ఉద్యోగం రాలేదు. సివిల్స్ సాధించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.