
అందుబాటులోకి ‘అమృత్ భారత్’
బెల్లంపల్లి: ఉత్తరాది రాష్ట్రమైన బీహార్‌లోని ముజా ఫర్‌పూర్ నుంచి హైదరాబాద్ సమీపంలోని చర్లపల్లి మధ్య నడిచే అమృత్ భారత్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్ మంచిర్యాల, కుమురంభీ ఆసిఫాబాద్ జిల్లావాసులకు అందుబాటులోకి రానుంది. ప్రధా ని నరేంద్ర మోదీ ఈ రైలును సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు వీక్లీ స్పెషల్‌గా నడిపి, అక్టోబర్ 14 నుంచి రెగ్యులర్ సర్వీస్‌గా మార్చనున్నట్లు సమాచారం. 14న ముజాఫర్‌పూర్ నుంచి చర్లపల్లికి బయలుదేరే ఈ రైలు, 16న తిరుగు ప్రయాణంలో చర్లపల్లి నుంచి ముజాఫర్‌పూర్‌కు వెళ్తుంది. తెలంగాణలో సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, రామగుండం, పెద్దపల్లి జంక్షన్, కాజీ పేట జంక్షన్ స్టేషన్లలో హాల్టింగ్ ఇచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వలస కార్మికుల సౌకర్యార్థం ఈ సర్వీస్ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
ఉత్తరాది ప్రయాణికులకు ప్రయోజనం..
ఈ అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ తెలంగాణ ప్రాంతవాసులకు గణనీయమైన లాభాలు చేకూరుస్తుంది. తక్కువ స్టేషన్లలో మాత్రమే ఆగడంతో వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ప్రస్తుతం అవసరాలకు తగిన రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల, కు మురంభీ ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఉత్తర భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులకు ఉపయోగపడుతుంది. మొదట వారాంతపు రైలుగా నడిపి, ప్రయాణికుల స్పందన ఆధారంగా రెగ్యులర్‌గా మార్చాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. రెగ్యులర్ సర్వీస్ అమలు కావడంతో మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఏసీ సదుపాయం మినహా, మిగిలిన అన్ని సౌకర్యాలు వందే భారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో సమానంగా ఉంటాయి.
22 కోచ్‌లు..
ప్రయాణికుల సౌలభ్యాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని అమృత్ భారత్ రైలును 22 కోచ్‌లతో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 11 జనరల్ అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు, 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 2 ఎస్‌ఎల్‌ఆర్ కోచ్‌లు, 1 లగేజ్ కోచ్ ఉన్నాయి. ముందు, వెన క రెండు ఇంజిన్లు జతచేస్తారు. ముజాఫర్‌పూర్ నుంచి ప్రతీ మంగళవారం ఉదయం 10:40కి బయలు దేరి, బుధవారం రాత్రి 11:50 గంటలకు చర్లపల్లి చే రుతుంది. తిరుగు మార్గంలో గురువారం తెల్లవారుజాము 4:05కి చర్లపల్లి నుంచి ప్రారంభమై, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముజాఫర్‌పూర్‌కు చేరుకుంటుంది.