
ఆసిఫాబాద్ డిప్యూటీ కలెక్టర్‌గా జసింత్ జోయల్
నిర్మల్‌ఖిల్లా: లక్ష్యం దిశగా శ్రమిస్తే స్వప్నం సాకారమవుతుంది. నిర్మల్‌కు చెందిన జసింత్ జోయల్ ఇందుకు నిదర్శనం. కరుణ–డేనియల్ దంపతుల పెద్ద కుమారుడు జసింత్ జోయల్ గ్రూప్–1 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బీసీ ‘సీ’ కేటగిరీలో రాష్ట్రస్థాయి తొలి ర్యాంక్ కై వసం చేసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఆసిఫాబాద్ డిప్యూటీ కలెక్టర్‌గా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. జోయల్ ఎనిమిదో తరగతి వరకు నిర్మల్ సెయింట్ థామస్ పాఠశాలలో, 9–10 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో గల కేకేఆర్ గౌతం స్కూల్‌లో, ఇంటర్ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో, బీటెక్ తమిళనాడులోని వెల్లూరులో పూర్తి చేశారు. అనంతరం బీహెచ్‌ఈఎల్‌లో రెండేళ్ల పాటు ఉద్యోగం చేసి తర్వాత నాలుగేళ్లుగా సివిల్స్ కోసం సన్నద్ధమవుతున్నారు. నిత్యం 18గంటలకు పైగా పుస్తకాలతో కుస్తీపట్టి శ్రమించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచారు. దీంతో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇతని తల్లి కరుణ సా రంగపూర్ మండలం ధని గ్రామ ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎంగా, తండ్రి డేనియల్ నిర్మల్ జిల్లా కేంద్రంలోని గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా పురోగమిస్తున్నట్లు జోయల్ తెలిపారు. జోయల్‌ను స్థానికులు అభినందిస్తున్నారు.