
ఉత్కంఠకు తెర!
స్థానిక సంస్థల ఎన్నికలకు మరో ముందడుగు జిల్లాలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు ‘జెడ్పీ’ స్థానం బీసీ జనరల్‌కు కేటాయింపు
ఆసిఫాబాద్‌అర్బన్: ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. స్థానిక సంస్థల నిర్వహణలో భాగంగా ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతిని ధుల సమక్షంలో డ్రా పద్ధతిలో స్థానాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలో 15 మండలాలకు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలకు రిజర్వేషన్ల ప్రకారం కేటాయించారు.
మారుతున్న సమీకరణాలు
రెండేళ్లుగా స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయికి వెళ్లడంలో జాప్యం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆశావహులు అనుకూలమైన స్థానాలు ఎంచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యతనిస్తూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో సమీకరణాలు పూర్తిగా మారాయి. అనేకచోట్ల ఆశావహుల అంచనాలు తారుమారయ్యాయి. ఎంతోకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కూడా రిజర్వేషన్లు మారడంతో తలలు పట్టుకుంటున్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా జిల్లాలో భిన్నమైన పరిస్థితి ఉంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేరు. ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో జిల్లాలో స్థానిక సంస్థల పోరు రసవత్తరంగా మారనుంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ వేడి రాజుకుంది. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
జెడ్పీ పీఠం బీసీ జనరల్
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థానాన్ని బీసీ జనరల్‌గా ఖరారు చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎస్టీ మహిళ రిజర్వేషన్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో తాజాగా బీసీలకు స్థానం కేటాయించారు.
జిల్లాలో ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు
మండలం ఎంపీపీ జెడ్పీటీసీ
లింగాపూర్ ఎస్టీ, మహిళ జనరల్(మహిళ)
సిర్పూర్(యూ) ఎస్టీ, మహిళ జనరల్
ఆసిఫాబాద్ ఎస్టీ, మహిళ ఎస్టీ, జనరల్
జైనూర్ ఎస్టీ, జనరల్ బీసీ, జనరల్
బెజ్జూర్ ఎస్టీ, జనరల్ ఎస్టీ, జనరల్
వాంకిడి ఎస్టీ, జనరల్ ఎస్టీ, మహిళ
పెంచికల్‌పేట్ ఎస్సీ, మహిళ ఎస్సీ, మహిళ
దహెగాం ఎస్సీ, జనరల్ ఎస్టీ, మహిళ
చింతలమానెపల్లి బీసీ, మహిళ ఎస్టీ, జనరల్
కాగజ్‌నగర్ బీసీ, మహిళ బీసీ, మహిళ
సిర్పూర్(టి) బీసీ, జనరల్ ఎస్సీ, జనరల్
రెబ్బెన బీసీ, జనరల్ బీసీ, మహిళ
కౌటాల బీసీ, జనరల్ బీసీ, జనరల్
తిర్యాణి జనరల్ బీసీ, మహిళ
కెరమెరి జనరల్(మహిళ) బీసీ, జనరల్