
భావితరాలకు కొండా లక్ష్మణ్ చరిత్ర అందించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన కొండా లక్ష్మ ణ్ బాపూజీ చరిత్రను భావితరాలకు అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పద్మశాలి సేవా సంఘం, బీసీ సంఘం ప్రతినిధులతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జిల్లావాసి కావడం గర్వకారణమన్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ బాపూజీ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి సజీవన్, సింగిల్ విండో చెర్మన్ అలీబిన్ అహ్మద్, పద్మశాలి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల ఆంజనేయులు, కార్యదర్శి మల్లయ్య, బీసీ సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.