
జైమాతా.. దుర్గమ్మ
బెంగాళీ గ్రామాల్లో నేటి నుంచి దసరా ఉత్సవాలు ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు, వినోద కార్యక్రమాలు నోరూరించే రసగుల్లలు, చమ్‌చమ్‌లు ప్రత్యేకం
రెండోరోజు సప్తమి నాడు గ్రామస్తులంతా ఉదయం, సాయంత్రం పూజ, హారతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.
మూడోరోజు అష్టమిని దుర్గాష్టమిగా పిలుస్తారు. దేవతామూర్తులకు పూలు, పత్రి, అక్షింతలతో అభిషేకం చేస్తారు.
నాలుగోరోజు దుర్గా మహర్నవమి నాడు ప్రత్యేక పూజలు చేస్తారు. బెంగాళీల సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలతో రాత్రి జాగరణ చేస్తారు.
ఐదోరోజు విజయ దశమినాడు సింధూర పూజ చేస్తారు. ఉత్సవాల అనంతరం విగ్రహాలకు విసర్జన నిర్వహిస్తారు. విజయదశమితో పూజలు ముగిస్తారు.
చింతలమానెపల్లి(సిర్పూర్): జిల్లాలోని బెంగాళీ గ్రామాల్లో దసరా సందడి మొదలైంది. కాళీమాతకు మరో రూపమైన దుర్గాదేవిని బెంగాళీ ప్రజలు అ త్యంత ఆర్భాటంగా జరుపుకోనున్నారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే అకాలి బోధన్ ఉత్సవాల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన వేదికలపై దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించనున్నారు. సిర్పూర్(టి) నియోజకవర్గంలోని కాగజ్‌నగర్ మండలం ఈస్‌గాం, నజ్రూల్‌నగర్, సీతానగర్, నామానగర్‌తోపాటు 11 గ్రామాలు, సిర్పూర్(టి) మండలం లక్ష్మీపూర్, చింతలమానెపల్లి మండలంలోని రవీంద్రనగర్– 1, రవీంద్రనగర్– 2లో నిర్వహించే ఉత్సవాలు స్థానికంగా ప్రసిద్ధి చెందాయి.
నేటి నుంచి ఉత్సవాలు
సాధారణంగా దసరా నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. అమ్మవారిని పలు అవతారాల్లో పూజిస్తారు. కానీ బెంగాళీలు మాత్రం దుర్గాదేవి, దేవతామూర్తుల విగ్రహాలను ఐదురోజులు మాత్రమే పూజిస్తారు. ఆదివారం ప్రారంభమయ్యే అకాలి బోధన్ ఉత్సవాలు అక్టోబర్ 2న దసరా రోజు ముగుస్తాయి. వినాయకుడు, కార్తీకేయుడు, లక్ష్మీదేవి, సరస్వతిదేవి, మహిషాసురుడు, వారి వాహనాల విగ్రహాలను ఏర్పాటు చేస్తా రు. ఐదురోజులూ ఒక్కో విశిష్టతను కలిగి ఉంటాయి. ప్రజలు నియమ, నిష్టలు పాటిస్తూ ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, మద్యమాంసాలకు దూరంగా ఉంటారు. చివరిరోజు నిమజ్జనం నిర్వహిస్తారు.
దశాబ్దాలుగా నిర్వహిస్తున్నాం
1970 దశకంలో ఈ ప్రాంతానికి వచ్చాం. నాటి నుంచి ఏటా దసరా సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. దశాబ్దాలుగా ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నాం. దుర్గాదేవికి మొక్కుకుంటాం. బంధుమిత్రులను ఆహ్వానించి మిఠాయిలతో మా ఆతిథ్యం అందిస్తాం.
– సుశీల్ మండల్, రవీంద్రనగర్–2
ప్రత్యేకతలు ఇవే..
అకాలి బోధన్ ఉత్సవాల్లో మొదటిరోజు దుర్గాషష్ఠి పూజ చేస్తారు. వేదపండితుల ఆధ్వర్యంలో ముందుగా మహిషాసురునికి పూజలు నిర్వహిస్తారు. ఘాట్‌స్థాపన, కలశ పూజ అనంతరం విగ్రహాలు ప్రతిష్టిస్తారు. వేదికకు నలుదిక్కులా కలశాలు స్థాపన చేసి దీప ప్రజ్వలన, కుంకుమార్చనలు నిర్వహించి ఉత్సవాలు ప్రారంభిస్తారు.

జైమాతా.. దుర్గమ్మ