
తెలంగాణకు గర్వకారణం బాపూజీ
ఆసిఫాబాద్‌అర్బన్: తెలంగాణకు కొండాలక్ష్మణ్ బాపూజీ గర్వకారణమని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శనివారం కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ 1915 సెప్టెంబర్ 27న జన్మించిన కొండా లక్ష్మణ్‌బాపూజీ గాంధీజీ ఆలోచనలతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. నిజాం, రజాకారుల అణచివేతకు ఎదురొడ్డి స్వాతంత్య్రం కోసం పోరాడారన్నారు. 1952లో ఆసిఫాబాద్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై .. డిప్యూటీ స్పీకర్, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా 1969లో మంత్రి పదవికి రాజీనామా చేయడం ఆయన త్యాగ స్వభావానికి నిదర్శమన్నారు. ఆయన అనుసరించిన న్యాయం, సమానత్వం, త్యాగం, సేవ విలువలు పోలీసు శాఖకు మార్గదర్శక సూత్రాలు నిలుస్తాయని తెలిపారు. ప్రతిఒక్కరూ ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ అంజన్న, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాణాప్రతాప్, ఐటీ కోర్ ఇన్స్‌పెక్టర్ రవీందర్, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, సీసీ కిరణ్, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు.