
వన్యప్రాణుల దాడిలో భార్యాభర్తలు మృతి!
సిర్పూర్(టి): సిర్పూర్(టి) మండలం అచ్చెల్లి బీట్ పరిధిలోని భీమన్న ఆలయ సమీపంలో గల అటవీ ప్రాంతంలో భార్యాభర్తలు మృతిచెందారు. వన్యప్రాణుల దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్(టి) మండలం అచ్చెల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరులు దూలం శేఖర్(52), సుశీల(46) దంపతులు రోజుమాదిరిగానే గురువారం పశువులు మేపేందుకు భీమన్న ఆలయం ప్రాంతంలోకి వెళ్లారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లారు. సమీప ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించారు. ఎస్సై సీహెచ్ సురేశ్ ఆధ్వర్యంలో సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా భీమన్న ఆలయ అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తించారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతదేహాలను మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
గ్రామస్తుల ఆందోళన
భార్యాభర్తల మృతికి గల కారణాలపై శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ కొనసాగింది. సాయంత్రం అటవీ, పోలీసుశాఖ అధికారులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేందర్ పోస్టుమార్టం చేసి విచారణ చేపట్టారు. అయినా దంపతుల మృతికి కారణాలను వెల్లడించేందుకు నిరాకరించారు. గ్రామస్తులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని ఎమ్మెల్సీ దండె విఠల్, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్ సుఖ్‌దేవ్ హామీ ఇవ్వడంతో శాంతించారు. ఒక్కొక్కరికి రూ.10లక్షల పరిహారం, కుమార్తెల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. వీరి వెంట తహసీల్దార్ రహీమొద్దీన్, ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌వో ప్రవీణ్, కౌటాల సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై సీహెచ్ సురేశ్ తదితరులు ఉన్నారు.
దూలం శేఖర్, సుశీల మృతదేహాలు
అనుమానాలెన్నో..?
అచ్చెల్లి బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భార్యభర్తలు దూలం శేఖర్, సుశీల మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. వన్యప్రాణుల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు భావిస్తున్నా పోస్టుమార్టం అనంతరం కూడా పోలీసులు, అటవీశాఖ అధికారులు స్పష్టతనివ్వలేదు. పేద కుటుంబానికి చెందిన వీరు పశువుల కాపరులుగా పనిచేస్తున్నారు. రాజేశ్వరి, మౌనిక, రోహిణి, అజయ్ సంతానం ఉన్నారు. గురువారం సాయంత్రం పశువులు యజమానుల ఇళ్లకు చేరడం, తల్లిదండ్రులు రాకపోవడంతో ఆందోళనలకు గురై గ్రామస్తులతో కలిసి పశువులు తీసుకెళ్లే మార్గంలో గాలించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా మృతదేహాలను గుర్తించారు. సీహెచ్‌సీలో వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణులు పోస్టుమార్టం చేసినా ఏ వన్యప్రాణి దాడిలో గాయాలయ్యాయో తేల్చలేకపోయారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
సిర్పూర్(టి) మండలంలోని అచ్చెల్లి బీట్ పరిధిలో అటవీప్రాంతంలో మృతి చెందిన దూలం శేఖర్, సుశీల కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రి వద్ద మృతదేహాలను శుక్రవారం పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సాయంగా కుటుంబ సభ్యులకు నగదు అందించారు. బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఫోన్‌లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వన్యప్రాణుల దాడిలో భార్యాభర్తలు మృతి!

వన్యప్రాణుల దాడిలో భార్యాభర్తలు మృతి!

వన్యప్రాణుల దాడిలో భార్యాభర్తలు మృతి!