
ఐలమ్మఆశయ సాధనకు కృషి
ఆసిఫాబాద్: చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అధికారులు, నాయకులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూమి, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి, బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. రజక సామాజిక వర్గంలోని పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి సజీవన్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, రజకసంఘం జిల్లా అధ్యక్షుడు కడ్తల మల్లయ్య, నాయకులు రవీందర్, భూమయ్య, సతీశ్, మధుకర్, శంకర్, మారుతి, సరస్వతి పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సంబురాలు
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలపై ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా అధికారులు, ఉద్యోగులు, మహిళా సంఘాలు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అలాగే సద్దుల బతుకమ్మ కోసం నిమజ్జనం చేసే వాగులు, చెరువుల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.