
‘ప్రజాపాలనలో కార్మికులకు పస్తులేనా..?’
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజాపాలనలో కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు పస్తులేనా అని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్ ప్రశ్నించారు. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, ఇతర డిమాండ్లు నెరవేర్చాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం పంచాయతీ కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ అతిపెద్ద పండుగ దసరాకు కార్మికులు ఇబ్బందులు పడకుండా మూడు నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ చానల్ ద్వారా నెలనెలా వేతనాలు ఖాతాల్లో జమ చేయాలన్నారు. జీవో 51 సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జాడి మోరేశ్వర్, కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు, కార్మికులు శంకర్, విలాస్, రాణి, పుష్పలత, నగేశ్, వెంకటేశ్, రమేశ్, సంతోష్ పాల్గొన్నారు.