
భగీరథ కార్మికుల వ్యథ
ఆరు నెలలుగా అందని వేతనాలు ఈ నెల 15 నుంచి సమ్మె బాట జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఆటంకం ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ప్రధాన డిమాండ్లు
తిర్యాణి(ఆసిఫాబాద్): ఇంటింటికీ తాగునీటి సరఫ రా చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్న మిషన్ భ గీరథ(గ్రిడ్) పథకం కాంట్రాక్టు కార్మికులు ఆరు నెలలుగా వేతనాలు రాక అవస్థలు పడుతున్నారు. కొన్నేళ్లుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తుండగా, అవి కూడా నెలనెలా అందడం లేదు. క్షేత్రస్థాయలో సమస్యలతో సతమవుతున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 15 నుంచి సమ్మెబాట పట్టారు. దీంతో జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భగీరథ నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లో ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు.
600 మంది కార్మికులు
జిల్లాలో మిషన్ భగీరథ పథకం కింద ఎల్‌అండ్‌టీ సంస్థ ఆధ్వర్యంలో కాంట్రాక్టు పద్ధతిన వాల్ ఆపరేటర్లు, ఫిట్టర్లు, సూపర్‌వైజర్లు, కూలీలుగా మొత్తం 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సూపర్‌వైజర్లకు రూ.15వేల వేతనం కాగా, మిగిలిన వారికి రూ.13వేల చొప్పున చెల్లిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా కార్మికులు ప్రతిరోజూ గ్రామాలను సందర్శిస్తున్నారు. సురక్షితమైన భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ వీరికి ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదు. పెట్రోల్‌కు కూడా డబ్బులు లేకపోవడంతో అప్పులు చేసి గ్రామాల్లో తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా రేపుమాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.