
వీడని ముసురు
ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు స్తంభించిన జన జీవనం రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు
కౌటాల(సిర్పూర్): జిల్లాలో ముసురు వాన వీడటం లేదు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేని వర్షం పండింది. ఒర్రెలు, వాగులు ఉప్పొంగి లోలెవల్ వంతెనలపై నుంచి వరద ప్రవహించింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీడని వానతో జిల్లా కేంద్రంలో ఓ ఇల్లు కూలింది. వాగులు, నదులతోపాటు ప్రభావిత ప్రాంతాలను రెవెన్యూ అధికా రులు పరిశీలించారు. పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నా రు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణ హిత నది, తాటిపల్లి వద్ద వార్దా నది, గుండాయిపేట, వీర్ధండి వద్ద వైన్‌గంగ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జాలరులు చేపల వేటతోపాటు నాటు పడవల ప్రయాణాలు నిలిపివేశారు. కౌటాల తహసీల్దార్ కార్యాలయ భవనంలోకి వర్షపు నీరు చేరింది. వీర్ధండి గ్రామంలోని ఇళ్లలోకి వరద చేరింది. చింతలమానెపల్లి మండలం రణవెల్లి వాగు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అధికారులు అప్రమత్తం
జిల్లాలో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం ఉంది. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలని కోరారు.
జిల్లాలో వర్షపాతం వివరాలు
(బుధవారం ఉదయం నుంచి
గురువారం ఉదయం వరకు)
ప్రాంతం వర్షపాతం(మి.మీ.)
బెజ్జూర్ 46.0
కౌటాల 48.9
చింతలమానెపల్లి 30.2
పెంచికల్‌పేట్ 41.4
దహెగాం 47.2
సిర్పూర్(టి) 44.8
రెబ్బెన 35.9
కాగజ్‌నగర్ 33.5
ఆసిఫాబాద్ 24.9