
విద్యార్థుల సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: విద్యాశాఖలో మండల స్థాయి అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గురువారం నిర్వహించిన విద్యా విభాగం సమగ్ర సమీక్ష వర్క్ షాపులో ఎంఈవోలు, గిరిజన అభివృద్ధి అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ రిసోర్స్‌పర్సన్లు, సిబ్బందికి శిక్షణ అందించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల వారీగా మౌలిక వసతులపై తనిఖీలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేసి నిర్ణీత నమూనాలో సమర్పించాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రొఫైల్, యూడైస్‌లో ప్రధానోపాధ్యాయుల వివరాలు, విద్యార్థుల ఆధార్, ఆపార్ సంఖ్యల నమోదు, నిధుల నిర్వహణ, డిజిటల్ పరికరాల పరిస్థితి, తదితర వివరాలు అప్‌డేట్ చేయాలని చేయాలని ఆదేశించారు. సమాచారం పారదర్శకంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ అబిద్ అలీ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.