
మిషన్ భగీరథ కార్మికుల ధర్నా
ఆసిఫాబాద్‌అర్బన్: మిషన్ భగీరథ(గ్రిడ్) పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కార్మికులకు ఆరు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈపీఎఫ్, ఈఎస్‌ఐ పూర్తి వివరాలు తెలియజేయాలని, ప్రతీ కార్మికుడికి బోనస్, కనీస వేతనంగా రూ.26వేలు చెల్లించాలని, ప్రతినెలా 1న వేతనాలు విడుదల చేయాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ డేవిడ్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి, నాయకులు బాలేశ్, షేక్ షకీర్, కార్మికులు రఫీక్, భగవత్, పురుషోత్తం, రవీందర్, సోహెల్, వెంకటేశ్, తాజ్, లక్ష్మణ్, శివ, విజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.