
పాఠశాలల్లో వసతుల కల్పనకు చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో తాగునీరు, మూత్రశాలలు, విద్యుత్, గదుల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. అర్ధంతరంగా నిలిచిపోయిన పనులపై కాంట్రాక్టర్లను సంప్రదించాలన్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన వసతుల కల్పన పనులు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో విద్యాశాఖ ఎస్‌వోలు అబిద్ అలీ, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.