సర్కారు విద్యార్థులకు సదావకాశం | - | Sakshi
Sakshi News home page

సర్కారు విద్యార్థులకు సదావకాశం

Sep 25 2025 7:27 AM | Updated on Sep 25 2025 7:27 AM

సర్కారు విద్యార్థులకు సదావకాశం

సర్కారు విద్యార్థులకు సదావకాశం

● ఎనిమిదో తరగతికి వారికి ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌ షిప్‌ ● అక్టోబర్‌ 6 వరకు దరఖాస్తు గడువు ● నవంబర్‌ 23న పరీక్ష

ఆసిఫాబాద్‌రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు అనుకూలించక నిరుపేద విద్యార్థులు మధ్యలోనే చదువు వదిలేస్తున్నారు. అలాంటి వారికి ఆర్థిక చేయూత అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులు నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌ షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) అందిస్తోంది. ప్రతిభ కలిగిన వారి ఉన్నత చదువులకు తోడ్పాటునందిస్తోంది. 2025– 26 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నవంబర్‌ 23న అర్హత పరీక్ష నిర్వహించనుండగా, ఆక్టోబర్‌ 6 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది.

దరఖాస్తు ఇలా..

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 721 ఉండగా, 29,246 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో ఎనిమిదో తరగతి వారు 3,821 మంది ఉన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మెరిట్‌ స్కాలర్‌షిప్‌నకు అర్హులు. వీరు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ఫారాలు తీసుకుని వివరాలు నింపాలి. వాటితోపాటు ఓసీ, బీసీ, మైనార్టీలు అయితే రూ.100, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు రూ.50 డీడీ తీసి దరఖాస్తును జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో అందించాలి. నవంబర్‌ 23న దేశవ్యాప్తంగా ఒకేసారి అర్హత పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్‌ అందిస్తారు.

అర్హతలు ఇవే..

8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఏడో తరగతి వార్షిక పరీక్షలో 55 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 50 శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది. ప్రభుత్వ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50లోపు ఉండాలి. హాస్టల్‌ సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. వసతిగృహాల్లో చదివేవారు అర్హులు కారు. ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి బోనఫైడ్‌ జత చేయాలి. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ఎక్కువ మంది ఏటా స్కాలర్‌షిప్‌నకు అర్హత సాధిస్తున్నారు.

180 మార్కులతో పేపర్‌

మల్టీపుల్‌ చాయిస్‌ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 180 మార్కుల ప్రశ్నపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్‌ ఏలో మానసిక సామర్థ్య పరీక్ష 90 మార్కులకు 90 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కోడింగ్‌, డీకోడింగ్‌, లాజికల్‌ ప్రశ్నలు, వెన్‌ చిత్రాలు, మిర్రర్‌ చిత్రాలు, వాటర్‌ ఇమేజెస్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, సంఖ్యాశాస్త్రం, పదాల భిన్నాలు, నంబర్‌ అనాలజీ, ఆల్ఫాబెట్‌ అనాలజీకి సంబంధించిన అంశాలు ఉంటాయి, పార్ట్‌ బీలో 30 మార్కులు సాంఘిక శాస్త్రం, 30 మార్కులు సామాన్య శాస్త్రం, 8వ తరగతి సంబంధించిన 30 ప్రశ్నలకు 30 మార్కులు కేటాయిస్తారు. ప్రశ్న పత్రం తెలుగు, ఆంగ్ల మీడియాల్లో అందిస్తారు.

విద్యార్థులను ప్రోత్సహించాలి

జిల్లాలోని ఉన్నత పాఠశాలలో 2025– 26 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదుతున్న విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించి దరఖాస్తు చేయించాలి. ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో అర్హత సాధిస్తే ఇంటర్‌ వరకు ఏటా రూ.12 వేలు స్కాలర్‌షిప్‌ వస్తుంది. విద్యార్థులు సైతం ఉన్నత చదువులు చదువుకుంటారు. ప్రధానోపాధ్యాయులు దృష్టి సారించి పరీక్ష రాయించాలి.

– ఉదయ్‌బాబు,

జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement