
పండుగకు పస్తులేనా..?
ఆసిఫాబాద్‌అర్బన్: గ్రామ పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఒకే నెలలో దసరా, దీపావళి పండుగలు వస్తుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణకు అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల పరిధిలో 1035 మంది మల్టీపర్పస్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి అదనంగా రోజువారీగా మరో 400 మంది వరకు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా వీరికి నెలనెలా వేతనాలు మాత్రం అందడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వంపై ఆశతో ఇతర పనుల్లోకి వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పారిశుద్ధ్య నిర్వహణలో కీలకం..
జిల్లాలోని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల శ్రమ కీలకం. వీధుల్లోని చెత్తను నిత్యం సేకరిస్తూ డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. రోజువారీ పనులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రత్యేక కార్యక్రమాల్లోనూ వీరు పాల్గొంటున్నారు. కార్మికులకు ప్రస్తుతం నెలకు రూ.9,500 చెల్లిస్తున్నారు. చాలీచా లని వేతనమైనా సకాలంలో అందడం లేదు. ప్రస్తుతం మూడు నెలలుగా పెండింగ్ ఉండటంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. జీతాలు ఆలస్యం కాకుండా గ్రీన్ చానల్ ద్వారా ప్రతినెలా 1న చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి, కనీస వేతనం అమలు చేయాలని, కార్మికులపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.