
కిడ్నాపర్ నుంచి తప్పించుకున్న బాలుడు
ఆదిలాబాద్‌టౌన్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని చిల్కూరినగర్‌కు చెందిన భరత్ అనే ఎనిమిదేళ్ల బాలుడు కిడ్నాపర్ చెర నుంచి తప్పించుకుని జిల్లాకు చేరుకున్నట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. సికింద్రాబాద్‌లో రైలు ఎక్కి తలమడుగు మండలంలోని కోసాయి స్టేషన్‌లో బుధవారం దిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఏడుస్తూ కనిపించిన బాలుడి వివరాలు తెలుసుకున్న రైల్వేస్టేషన్ సిబ్బంది తలమడుగు పోలీసులతో పాటు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని కోసాయికి వెళ్లి బాలుడిని ఆదిలాబాద్ బాల రక్షక్ భవన్‌కు తీసుకువచ్చినట్లు తెలిపారు. కాగా అపరిచిత వ్యక్తి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా తప్పించుకుని రైలు ఎక్కానని బాలుడు చెప్పినట్లు పేర్కొన్నారు. చందు, సునీత తన తల్లిదండ్రులుగా చెబుతున్నాడని, కాగా బాలుడి గురించి మల్కాజిగిరి డీసీపీవో సిబ్బందికి సమాచారం అందించామని వివరించారు. ఆయన వెంట ష్యూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ కిల్లారే వినోద్, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, వినోద్ తదితరులు ఉన్నారు.