
పీజీ చదివి.. పూలబాట
● బంతి, చామంతి, సీతమ్మ జడల సాగు ● వాణిజ్య పంటల వైపు మొగ్గు
లక్సెట్టిపేట: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన పెండ్యాల శ్రీనివాస్ హైదరాబాద్‌లో పీజీ(ఎమ్మెస్సీ జువాలజీ) పూర్తి చేశాడు. నాలుగేళ్లపాటు ఉద్యోగాన్వేషణ చేసినా ఫలితం లేకపోండంతో ఇంటిబాట పట్టాడు. తమ కుటుంబానికి ఉన్న ఆరెకరాల్లో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకే రకమైన పంట కాకుండా విభిన్న రకాలుగా నూతన శైలిలో పండించాలని కొంత భాగం వరికి వదిలి పూల తోటల వైపు మళ్లాడు. దసరా, దీపావళికి చేతికొచ్చేలా బంతి, సీతమ్మజెడలు, చామంతి సాగు చేస్తున్నాడు. ఇవి పూర్తి కాగానే అదే భూమిలో బెండకాయలు, కొత్తిమీర, ఎల్లిపాయలు సాగు చేస్తుంటాడు. దీంతో పంట మార్పిడితో దిగుబడి అధికంగా ఉంటోంది. బంతి, చామంతి, సీతమ్మజెడలు పూలను మంచిర్యాల, జగిత్యాల, జన్నారం తదితర ప్రాంతాల్లోని వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. వాణిజ్య పంటలపై దృష్టి సారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు పెండ్యాల శ్రీనివాస్ కోరుతున్నాడు. పనిముట్లు ఇవ్వాలని, శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపాడు. పంటమార్పిడి చాలా అవసరమని, ఒకే రకమైన పంటతో ఇబ్బందికరంగా ఉంటుందని, ఒకటి నష్టపోతే మరొకటి లాభంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.