
అర్ధరాత్రి అమ్మకాలు!
జిల్లాలోకి అక్రమంగా యూరియా సరఫరా రాత్రిపూట రైతులకు అధిక ధరలకు విక్రయం అన్నదాతల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
కౌటాల మండలం శీర్షా గ్రామంలోని శ్రీఆంజనేయ ట్రేడర్స్, శ్రీకొండయ్య ట్రేడర్స్‌లో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన యూరియా బస్తాలను ఈ నెల 20న వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. మంచిర్యాల నుంచి రెండు లారీల్లో 523 యూరియా బస్తాలు తెచ్చి డీలర్లు రాత్రికి రాత్రే అధిక ధరలకు రైతులకు అమ్మేశారు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపట్టి నిల్వ ఉంచిన 118 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
సిర్పూర్(టి) మండలం భూపాలపట్నంలోని శ్రీనివాస ఫర్టిలైజర్ దుకాణానికి ఈ నెల 19న అర్ధరాత్రి లారీలో 19.98 మెట్రిక్ టన్నుల యూరియా లోడ్ వచ్చింది. వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వకుండా బస్తాలను విక్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బస్తాలతోపాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి దందా చేసిన ఫర్టిలైజర్ షాపులో అమ్మకాలను నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
కౌటాల(సిర్పూర్): వానాకాలం సీజన్‌లో సాగు చేసి న పంటలకు ఎరువులు వేయడానికి రైతులు గతంలో ఎప్పుడూ లేనివిధంగా అవస్థలు పడుతున్నారు. రైతువేదికలు, పీఏసీఎస్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఫర్టిలైజర్ షాపుల యజమానులు అక్రమ దందాకు తెరతీస్తున్నారు. అర్ధరాత్రి అక్రమంగా అధిక ధరలకు బస్తాలు అమ్ముతున్నారు.
60 వేల మెట్రిక్ టన్నులు అవసరం
జిల్లాలో 1.42 లక్షల మంది రైతులు వానాకాలం సీజన్‌లో 4.40 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది, తదితర పంటలు సాగు చేస్తున్నారు. పంటలకు ఈ సీజన్‌లో 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. ఇప్పటివరకు 40 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. మరో 20 వేల మెట్రిక్ టన్నుల లోటు ఉంది. సహకార సంఘాల్లో ఎన్ని ఎకరాల భూమి ఉన్నా పట్టా పుస్తకానికి కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. జూలై, ఆగస్టులో యూరియా కోసం పట్టాపత్రాలు అందించిన వారికి ఈ నెల 20వ తేదీ వరకు అందించారు. పట్టా పాసుపుస్తకం అందించిన నెలన్నర రోజుల తర్వాతగానీ రైతులకు యూరియా అందడం లేదు. మరోవైపు పట్టాలు లేని కౌలు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.
అక్రమంగా దిగుమతి చేసుకుని..
ప్రస్తుతం పత్తి పంట పూతకాత దశలో ఉండగా.. వరి ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఎరువులు వేసే సమయం కావడంతో రైతులు బస్తాల కోసం తండ్లాడుతున్నారు. ఇదే అదనుగా భావించి కొందరు ప్రై వేట్ వ్యాపారులు లారీల్లో అక్రమంగా యూరియా ను మహారాష్ట్ర, ఇతర జిల్లాల నుంచి తీసుకువస్తున్నారు. అధిక ధరలకు రైతులకు రాత్రిపూట రహస్యంగా అమ్ముతున్నారు. బస్తాల కోసం రోజుల త రబడి తిరిగి అలసిపోయిన అన్నదాతలు సహకార సంఘాలపై ఆశలు వదులుకుని డీలర్ల వద్దకు వెళ్తున్నారు. అసలు ధరకు నాలుగింతలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. రైతులే ముందస్తు డబ్బులు చెల్లించి ధర ఎంతైనా బస్తాలు ఇవ్వాలని డీల్లర్ల చు ట్టూ తిరుగుతున్నారు. కాగా, సరిపడా యూరియా పంపిణీ చేయడంలో విఫలమవ్వడం, యూరియా ను ప్రైవేట్ వ్యాపారులకు కేటాయించారనే అభియోగాలపై జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరా వును ఆ శాఖ రాష్ట్ర సంచాలకుడు గోపి ఈ నెల 20 న సస్పెండ్ చేశారు. కొరతపై జిల్లా రైతన్నలు రోడ్డెక్కడం సైతం డీఏవోపై చర్యలు తీసుకోవడానికి ఓ కారణంగా తెలుస్తోంది. అధికారులే నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ వ్యాపారులకు మద్దతుగా నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం
మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా యూరియా తరలిస్తే కేసులు నమోదు చేస్తాం. అక్రమ రవాణాను అరికట్టేందుకు వ్యవసాయశాఖ, పోలీసుశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. అన్ని అనుమతులు ఉంటేనే యూరియా రవాణా చేయాలి.
– ఎండీ వహీదుద్దీన్, కాగజ్‌నగర్ డీఎస్పీ