తనిఖీలు కరువు.. కల్తీల జోరు | - | Sakshi
Sakshi News home page

తనిఖీలు కరువు.. కల్తీల జోరు

Sep 24 2025 5:33 AM | Updated on Sep 24 2025 5:33 AM

తనిఖీలు కరువు.. కల్తీల జోరు

తనిఖీలు కరువు.. కల్తీల జోరు

● ఆరు నెలల క్రితం కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఓ హోటల్‌లో కొందరు భోజనం చేస్తుండగా కూరలో పురుగులు వచ్చాయి. ఈ విషయం భోజన ప్రియులను కలవరపెట్టింది. ఆ సమయంలో అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి మమ అనిపించారు. ● దహెగాం మండల కేంద్రంలోని ఇటీవల ఓ హోటల్‌లో బూజు పట్టిన స్వీట్లు అమ్మగా, స్థానికులు నిలదీశారు. కౌటాల మండల కేంద్రంలోని ఓ షాపులోనూ యజమానులు బూజు పట్టిన బ్రెడ్‌ విక్రయించారు. ● రెండు నెలల క్రితం తిర్యాణి మండల కేంద్రంలోని కుమురంభీం చౌరస్తా సమీపంలో గల షాపులో కాలం చెల్లిన కేక్‌లు విక్రయించారు.

నిబంధనలు పాటించని బేకరీలు, హోటళ్లు.. పాడైన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, వస్తువులు విక్రయం వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు

కాగజ్‌నగర్‌లోని ఓ మార్ట్‌లో పట్టణానికి చెందిన వ్యక్తి మిల్కీ మిస్ట్‌ ప్యాక్‌లను ఈ నెల 13న కొనుగోలు చేశాడు. కుమారుడికి దానిని తాగించగా అస్వస్థతకు గురయ్యాడు. మళ్లీ ఈ నెల 21న మళ్లీ అదే షాపునకు వెళ్లి మూడు మిల్కీమిస్ట్‌ పానీయాలు కొన్నాడు. బిల్లు చెల్లించి వాటిపై ఉన్న గడువు తేదీని పరిశీలించగా, ఈ నెల 4న ముగిసినట్లు ఉంది. ఈ విషయంపై షాపు యజమానులను ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇలా జిల్లాలోని అనేక దుకాణాలు, బేకరీలు, హోటళ్లలో కాలం చెల్లిన, కల్తీ వస్తువులు విక్రయిస్తున్నా అధికారులు తనిఖీలు చేపట్టడం లేదు.

కాగజ్‌నగర్‌టౌన్‌: జిల్లాలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు కొరవడడంతో షాపింగ్‌మాల్స్‌, కిరాణ షాపులు, హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌సెంటర్లలో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పదార్థాలు, కల్తీ చేసిన వస్తువులు విక్రయిస్తున్నారు. మార్టులు, షాపుల్లో కాలం గడువు ముగిసిన వాటిని వినియోదారులకు అంటగడుతున్నారు. ముఖ్యంగా వాణిజ్యపరంగా కీలకమైన కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ పట్టణాల్లోని హోటళ్లు, బేకరీలు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. ఇక రోడ్ల పక్కనే నిర్వహించే హోటళ్లు, స్వీట్‌షాపులపై కనీస పర్యవేక్షణ లేకపోవడం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది.

పట్టించుకునే వారేరి..?

ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు కొరవడడంతో వినియోగదారుల ఆరోగ్య భద్రతను పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఇటీవల కాగజ్‌నగర్‌లోని ఓ మార్ట్‌లో ఒకరికి కాలంచెల్లిన మిల్కీమిస్ట్‌ ప్యాకెట్లు అంటగట్టారు. వినియోగదారుడు ప్రశ్నించగా.. ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమని షాపు యజమాని దురుసుగా ప్రవర్తించాడు. బాధితుడు ఫుడ్‌సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. కనీసం నెలకు ఒకసారి స్వీట్‌హౌస్‌లు, బేకరీలు, తినుబండారాలు విక్రయించే షాపుల్లో తనిఖీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇవేమీ జిల్లాలో అమలు కావడం లేదు.

జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలు..

చర్యలు తీసుకుంటాం

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని షాపింగ్‌ మాల్స్‌, స్వీట్‌షాపులు, హోటళ్లు, కిరాణ షాపుల్లో తనిఖీలు చేపడతాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం. యజమానులు, నిర్వాహకులకు నోటీసులు అందించి శాఖ పరంగా చర్యలు చేపడుతాం.

– రాజేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, కాగజ్‌నగర్‌

అంతా కల్తీయే..!

పండగలు, పుట్టిన రోజు, ఇతర ముఖ్యమైన రోజుల్లో సంతోషాన్ని పంచుకోవాలన్నా తీపితోనే మొదలవుతుంది. కానీ బేకరీలు, స్వీట్‌ షాపులు కల్తీ మిఠాయిలు విక్రయిస్తుండటంతో తిన్నవారు ఆస్పత్రుల పాలవుతున్నారు. వాడిన నూనెనే మళ్లీ వాడడం, రుచి కోసం రసాయనాలు వినియోగించడం, కల్తీ పాలు, నెయ్యి, ఇతర పదార్థాలను కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారులు తూతూమంత్రంగా ఏడాదికి ఒకసారి జిల్లాలో తనిఖీలు చేపడుతున్నారు. నిర్వాహకులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కేవలం రెండు, మూడు హోటళ్లు, స్వీట్‌షాపులను తనిఖీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఇటీవల కాగజ్‌నగర్‌లోని పలు హోటళ్లు నాణ్యత పాటించడం లేదని పలువురు పట్టణవాసులు ఫిర్యాదులు చేసినా నామమాత్రంగా నోటీసులు అందించగా, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయమై ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తారాసింగ్‌ నాయక్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement