
అడవుల రక్షణలో ‘హంటర్’
పెంచికల్‌పేట్(సిర్పూర్): అడవుల్లో అక్రమంగా ప్రవేశించి చెట్లను నరకడం, వన్యప్రాణులను వేటాడడం, స్లగ్మింగ్ వంటి నేరాలను నియంత్రించడానికి కవ్వాల్ అభయారణ్యంలో అధికారులు డాగ్‌స్క్వాడ్ సేవలను వినియోగిస్తున్నారు. గతంలో నేరస్తులను పట్టుకోవడానికి వినియోగించిన చీతా అనే డాగ్‌స్క్వాడ్ గుండెపోటుతో మరణించింది. దానిస్థానంలో ఆగస్టు 15న హంటర్ అనే డాగ్‌ను విధుల్లోకి తీసుకున్నారు. జిల్లా అటవీశాఖ అధికారులు హంటర్ సేవలను జిల్లాలోనూ వినియోగిస్తున్నారు. నేరస్తులను పట్టుకోవడంలో డాగ్‌స్క్వాడ్ సాయం తీసుకుంటున్నారు. అలాగే అటవీ సమీప ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఏడు నెలల శిక్షణ..
బెల్జియం షెప్పర్డ్ మెలనాయిస్ జాతికి చెందిన హంటర్ జాగిలానికి మూడు నెలలు వయస్సు నుంచి హర్యానా రాష్ట్రంలోని పంచకుళ ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అండ్ ఎనిమల్స్(ఎన్‌టీసీడీ)లో శిక్షణ అందించారు. అడవుల్లో వాసన పసిగట్టడం, జంతువుల కదలికలు, అటవీ ఉత్పత్తులు, స్మగ్లర్ల కదలికలపై దాదాపు ఏడు నెలలపాటు శిక్షణ కల్పించారు. అలాగే జన్నారం అటవీ రేంజ్‌లో ఎఫ్‌బీవోలుగా విధులు నిర్వహిస్తున్న అనిల్‌కుమార్, పరమేశ్ కూడా జాగిలం వినియోగంపై శిక్షణ తీసుకున్నారు. ఈ జాగిలం జన్నారం కేంద్రంగా కవ్వాల్ అభయారణ్యంలో జరిగే అటవీ నేరాలను అదుపు చేయడంతోపాటు అడవుల రక్షణ, నేరస్తులను పట్టుకోవడానికి వినియోగిస్తున్నారు. ఇటీవల జన్నారం రేంజ్ పరిధిలోని గోండుగూడ అటవీ ప్రాంతంలో టేకు చెట్లు నరికిన హీరాలాల్ అనే వ్యక్తిని పట్టుకుంది. సుమారు 8 నుంచి 10 ఏళ్లపాటు ఈ జాగిలం సేవలు అందిస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
చెట్లు నరికివేత, వన్యప్రాణుల వేట, అటవీ ఉత్పత్తుల అక్రమ రవాణాను నిరోధించటానికి కవ్వాల్ రిజర్వు ఫారెస్టులో హంటర్ జాగిలం సేవలు వినియోగిస్తున్నారు. నూతనంగా విధుల్లో చేరిన జాగిలంతో జిల్లాలోని రేంజ్ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది, ఎనిమల్ ట్రాకర్స్‌కు సైతం అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో అటవీ నేరాలు నియంత్రించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. జిల్లాలోనూ నేరస్తులను పట్టుకోవడానికి హంటర్ సేవలు సద్వినియోగం చేసుకుంటాం. – నీరజ్‌కుమార్
టిబ్రేవాల్, జిల్లా అటవీశాఖ అధికారి