
వెల్ఫేర్ బోర్డు ద్వారా పథకాలు అమలు చేయాలి
కాగజ్‌నగర్‌టౌన్: జీవో నం.12ను సవరించి, భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పట్టణంలోని లేబర్ కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ భవన నిర్మాణ, ఇతర కార్మిక సంక్షేమ బోర్డుల ద్వారా అమలు చేస్తున్న నాలుగు పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో 12ను విడుదల చేసిందని తెలిపారు. 1996 భవన నిర్మాణ కార్మికుల చట్టం నిబంధనల విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన రూ.346 కోట్లను తిరిగి వెల్ఫేర్ బోర్డు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలకిషన్, ఎస్‌కే గౌస్, జిల్లా కోశాధికారి ఆనంద్‌రావు, కార్మికులు పాల్గొన్నారు.