శ్రమ ఫలం.. 34శాతం | - | Sakshi
Sakshi News home page

శ్రమ ఫలం.. 34శాతం

Sep 23 2025 7:45 AM | Updated on Sep 23 2025 7:45 AM

శ్రమ ఫలం.. 34శాతం

శ్రమ ఫలం.. 34శాతం

సింగరేణి లాభాలు, వాటాను ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కో కార్మికునికి సగటున రూ.1.95 లక్షలు కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.5,500 క్రితంసారితో పోల్చితే స్వల్ప పెరుగుదలే.. రీజియన్‌ పరిధిలో 14,137 మందికి వాటా పంపిణీ

(రూ. కోట్లు) (రూ. కోట్లు)

శ్రీరాంపూర్‌: సింగరేణి కార్మికులు చెమటను రక్తంగా మార్చి.. ప్రాణాలు పణంగా పెట్టి బొగ్గు ఉత్పత్తి చేస్తుంటారు. అలాంటి కార్మికుల త్యాగానికి ఏదీ సరితూగదు. కానీ ప్రతీ సంవత్సరం వారి శ్రమ ఫలితంగా లభించే లాభాల వాటా కొంత ఊరటనిస్తుంది. గత ఆరు నెలల నిరీక్షణకు తెరపడింది. కంపెనీ గత 2024–25 ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాల నుంచి కార్మికులకు 34శాతం వాటా చెల్లించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో కంపెనీ లాభాలు, వాటా ప్రకటించారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం రూ.6,364 కోట్లు లాభాలను ఆర్జించింది. ఇందులో భవిష్యత్‌ ప్రాజెక్టుల పెట్టుబడుల కోసం రూ.4,034 కోట్లు పక్కనబెట్టి మిగతా రూ.2,360 కోట్లు నికర లాభం చూపించారు. ఇందులో నుంచి కార్మికులకు 34శాతం వాటాగా రూ.802.4 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఏ తేదీన పంపిణీ చేస్తారనేది కంపెనీ అధికారులు త్వరలో ప్రకటిస్తారు. ఏడాదిలో కార్మికుల మస్టర్లు, వ్యక్తిగత, గ్రూపు పని తీరు ఆధారంగా ఈ మొత్తాన్ని పంచుతారు. కంపెనీలో 40,476మంది కార్మికులు లాభాల వాటా పొందుతారు. కనిష్టంగా రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.2.50లక్షల వరకు చెల్లిస్తారు. ఒక్కో కార్మికునికి సగటున రూ.1.95లక్షలు లాభాల వాటా అందుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

బెల్లంపల్లి రీజియన్‌ పరిధిలో..

ఆసిఫాబాద్‌ కుమురంభీం, మంచిర్యాల జిల్లాల పరిధిలోని బెల్లంపల్లి రీజియన్‌ గనుల్లో 14,137 మంది కార్మికులు పని చేస్తున్నారు. బెల్లంపల్లిలో 951, మందమర్రిలో 4,652, శ్రీరాంపూర్‌లో 8,534 మంది కార్మికులు ఉన్నారు. వీరితో పాటు సుమారు 3,800 మంది కాంట్రాక్ట్‌ కార్మి కులూ లాభాల వాటా పొందనున్నారు.

కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.500 పెంపు

కంపెనీలో ఓబీలు, సివిక్‌, స్టోర్స్‌, టింబర్‌యార్డులు, ఇతర డిపార్టుమెంట్లలో సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. వీరికి బోనస్‌ కింద రూ.17 కోట్లు పంచనున్నారు. క్రితంసారి నుంచే లాభాల బోనస్‌ను ఇస్తున్నారు. మొదటిసారి ఒక్కొక్కరికి రూ.5 వేలు చెల్లించారు. ఈసారి రూ.500 పెంచి రూ.5,500 చెల్లించనున్నారు.

మొదటిసారి ఆర్భాటం..

ప్రతీసారి లాభాల వాటాను ముఖ్యమంత్రి, కొద్ది మంది మంత్రులు, సింగరేణి ప్రతినిధుల సమక్షంలో ప్రకటించేవారు. ఈసారి ఆర్భాటంగా ప్రకటన చేశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు మంత్రులు, కోల్‌బెల్ట్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రకటన చేశారు. ప్రతీసారి కంపెనీ అధికారులు లాభాలు ప్రకటిస్తే వాటాను ము ఖ్యమంత్రి ప్రకటించేవారు. ఈసారి లాభాలు, వా టా అన్ని సీఎం చేతుల మీదుగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంస్థ సీఎండీ బలరాంతోపాటు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతా రామయ్య, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌, యూనియన్‌ ముఖ్యనేతలు హాజరయ్యారు.

పెరిగింది రూ.6.4 కోట్లే..!

క్రితంసారి లాభాల వాటా పంపిణీతో పోల్చితే ఈసారి మొత్తంగా పంపిణీ చేసే లాభాలు రూ.6.4 కోట్లే పెరిగాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వాస్తవ లాభాలు రూ.4,071 కోట్లు ఉండగా భవిష్యత్‌ ప్రాజెక్టులకు పెట్టుబడులు కింద రూ.2,289 కోట్లు పక్కన పెట్టి నికర లాభం రూ.2,412 కోట్లు ప్రకటించి.. అందులో నుంచి 33శాతం వాటా కింద రూ.796 కోట్లు పంపిణీ చేశారు. ఈసారి రూ.802.4 కోట్లు పంపిణీ చేయనున్నారు. క్రితంసారి భవిష్యత్‌ ప్రాజెక్టుల కోసం పెట్టిన డబ్బుల కంటే అదనంగా రూ.1,745 కోట్లు చూపడంతో లాభాలు పెరిగినా వచ్చే వాటా డబ్బులు గతం కంటే స్వల్పమే అయ్యిందని కార్మికులు పెదవి విరుస్తున్నారు.

కంపెనీ లాభాలు, పంపిణీ చేసిన వాటా వివరాలు

ఆర్థిక సం.. నికర లాభం వాటా శాతం పంపిణీ

2020–21 272.64 29 79.06

2021–22 1,227 30 368

2022–23 2,222.46 32 711.18

2023–24 2,412 33 796

2024–25 2,360 34 802.4

నిరాశ పరిచారు..

కంపెనీ లాభాల వాటా నిరాశపర్చింది. గతం కంటే లాభాలు పెరిగినందుకు ఎక్కువగా వస్తాయనుకున్నాం. కానీ గుర్తింపు సంఘంతో ముందుగా సంప్రదించకుండా ఏకపక్షంగా వాటా ప్రకటించారు. వాస్తవ లాభాలపై వాటా ప్రకటించి ఉంటే కార్మికులకు మరింత ఆర్థిక ప్రయోజనం జరిగేది.

– వీ.సీతారామయ్య, గుర్తింపు సంఘం అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement