
పక్కాగా వసతుల లెక్క
గ్రామ పంచాయతీల్లో మొదలైన సర్వే రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర వసతులపై సమాచారం సేకరణ ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు
రెబ్బెన(ఆసిఫాబాద్): గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై కచ్చితమైన సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. సర్వే చేపట్టి వివరాలను ఆన్‌లైన్‌లో పకడ్బందీగా పొందుపర్చేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే దీనిపై కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. సర్వే బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. గతంలోనే పంచాయతీ కార్యదర్శులు రోడ్లు, డ్రెయినేజీలు, ప్రభుత్వ భవనాల వివరాలను ప్రభుత్వానికి తెలియజేసినా.. కచ్చితమైన సమాచార సేకరణ కోసం ప్రభుత్వం మరోసారి సర్వే చేపడుతున్నట్లు తెలుస్తోంది. కార్యదర్శులు ప్రభుత్వం కోరిన సమాచారాన్ని ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. పంచాయతీ పాలన కోసం తీసుకువచ్చిన పల్లె ప్రగతి యాప్‌లోనే కొత్త ఆప్షన్ ఇచ్చి అప్‌డేట్ చేశారు.
కార్యదర్శులకు అవగాహన
సర్వేపై జిల్లా పంచాయతీ అధికారి అన్ని పంచాయతీల కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివరాల సేకరణపై అవగాహన కల్పించారు. జాగ్రత్తలు, నివేదికల తయారీ కోసం చేపట్టాల్సిన చర్యలను వివరించారు. సర్వేకు నిర్దిష్టమైన గడువు విధించకపోయినా.. సాధ్యమైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు. యాప్‌లో సమాచారం పొందుపరిచిన తర్వాత ఎంపీడీవోలు, డీపీవో ధ్రువీకరణ అనంతరం నివేదికలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరేట్‌కు అందించనున్నారు. గ్రామ పంచాయతీల ప్రస్తుత స్వరూపం, అందుబాటులో ఉన్న వసతులపై ప్రభుత్వానికి కచ్చితమైన అవగాహన రానుంది.
పంచాయతీల స్వరూపం తెలిసేలా..
భవిష్యత్తులో పంచాయతీలకు కల్పించాల్సిన అదనపు వసతుల కోసం నిధుల కేటాయింపు, ఇతర అవసరాలకు సర్వే వివరాలు ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ భవనాల తీరు, రోడ్లు, మురుగునీటి కాలువల పరిస్థితి, డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, చెత్త సేకరణ కోసం ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రాలీల స్థితిగతులపై అంచనా ఉంటుంది. శిథిలావస్థకు చేరిన అంగన్‌వాడీ, పాఠశాల భవనాలకు నిధుల కేటాయింపు, మరుగుదొడ్లు, ప్రహరీలు, తాగునీటి వసతి మెరుపర్చేందుకు చర్యలు తీసుకోవచ్చు. అదనపు వీధిదీపాల ఆవశ్యకత వంటి అంశాలతోపాటు రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు అవకాశం కలుగుతుంది.
మొదలైన సమాచార సేకరణ
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే పంచాయతీల్లో మౌలిక వసతుల పక్కా సమాచారం కోసం సమాచార సేకరణ ప్రక్రియ మొదలైంది. పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రంథాలయాలు, వ్యవసాయ సంఘం, పశువైద్య ఉపకేంద్రాలు, పాఠశాల భవనాలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలు, వీధి దీపాలు, కుళాయిలు, బోర్లు, డ్రెయినేజీలు, లింకురోడ్లు, ఇంకుడు గుంతలు, ట్రాక్టర్, ట్రాలీలు, రైతువేదిక, గ్రామ మ్యాప్‌లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పాలసేకరణ కేంద్రాలు.. ఇలా అందుబాటులో ఉన్న ప్రతీ వసతిపై సర్వే చేపడుతున్నారు. పల్లె ప్రగతి యాప్‌లోనే జీపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్ అనే కొత్త ఆప్షన్ ఇవ్వగా, వివరాలు అందులో పొందుపరుస్తున్నారు. 23 రకాల సమాచారాన్ని సేకరించి అప్‌లోడ్ చేసేలా యాప్‌ను సిద్ధం చేశారు.