
అర్జీలు అందించి.. పరిష్కారం కోరి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అర్జీలు సమర్పించారు. తమ సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు విన్నవించారు. అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా దహెగాం మండలం చౌక గ్రామానికి రేషన్ షాపు మంజూరు చేయాలని గ్రామస్తులు అర్జీ సమర్పించారు. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామ పరిధిలోని భీమన్నగూడకు బీటీ రోడ్డు నిర్మించాలని కొలాం గిరిజనులు కోరారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌కు చెందిన ఆవిడపు శ్రీకర్ అర్జీ పెట్టుకున్నాడు. తమ భూమికి అక్రమంగా చేసిన పట్టా రద్దు చేసి, తమ పేరిట పట్టా మంజూరు చేయాలని రెబ్బెన మండలం వంకులం గ్రామానికి చెందిన తురం రమేశ్ విన్నవించాడు. జీఎన్‌ఎం, వృత్తివిద్యా కోర్సు పూర్తి చేసిన తనకు ఉపాధి చూపాలని జైనూర్ మండలం గూడమామడ గ్రామానికి చెందిన మెస్రం యశోద అర్జీ సమర్పించింది. గృహజ్యోతి వర్తింపజేయాలని కౌటాల మండలం గురుడుపేట గ్రామానికి చెందిన నారాయణ దరఖాస్తు చేసుకున్నాడు. దివ్యాంగుడినైన తనకు ట్రైసైకిల్ మంజూరు చేయాలని కెరమెరి శివదాస్ నగర్‌కు చెందిన బానోత్ దస్రు కోరాడు. కౌటాల వారసంతలో నిర్మించిన మరుగుదొడ్లకు అధికారులు బిల్లులు ఇప్పించాలని మండల కేంద్రానికి మల్లయ్య దరఖాస్తు చేసుకున్నాడు.