
త్వరగా నష్టపరిహారం చెల్లించాలి
ఆసిఫాబాద్: జాతీయ రహదారుల నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి త్వరగా నష్టపరిహారం చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అటవీ అధికారులు, అదనపు కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ జాతీయ, గ్రీన్‌ఫీల్డ్ రహదారుల నిర్మాణంలో కోల్పోతున్న భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల వివరా లు సేకరించాలన్నారు. అటవీశాఖ అనుమతులు, కోర్టు కేసులు పరిష్కరించి యజమానులకు నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
రిజర్వేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లకు రిజర్వేషన్ ప్రక్రియ విధి విధానాలపై ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2019లో ఎన్నికల రిజర్వేషన్లు, 2011 జనాభా, 2024లో వెనుకబడిన తరగతుల గణనను ప్రామాణికంగా తీసుకుని లోటుపాట్లు లేకుండా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.