
చేయూత
మున్సిపాలిటీల్లో ‘లోక్ కళ్యాణ్ మేళా’ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చిరువ్యాపారులకు రుణాలు ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్పెషల్ క్యాంపెయిన్
వీధి వ్యాపారులకు
ఆసిఫాబాద్: వీధి వ్యాపారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం లోక్ కళ్యాణ్ మేళా కింద రుణాలు అందిస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో ఈ నెల 17 నుంచి స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు కొనసాగనుంది. కొత్తగా వీధి వ్యాపారాలు చేస్తున్న వారిని ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి(పీఎం స్వనిధి) పథకంలో చేర్చనున్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు మేళాలు నిర్వహిస్తున్నారు. తొలివిడతగా రూ.15 వేలు, రెండో విడతలో రూ.25 వేలు, మూడో విడత రూ.50 వేల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు. కూరగాయల వ్యాపారులతోపాటు వీధుల్లో ఇతర వ్యాపారం చేసుకునే వారికి ఈ పథకం అమలవుతుంది.
అక్టోబర్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ
జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రత్యేక మేళాల్లో ఒక్కో మున్సిపాలిటీకి చెందిన 25 మందికి రుణాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం కాగజ్‌నగర్ మున్సిపాలిటీలోనే ఈ పథకం అమలువుతుండగా, కొత్తగా ఏర్పడిన ఆసిఫాబాద్‌లో ఇంకా ప్రారంభించలేదు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ఇప్పటివరకు 3,125 మంది దరఖాస్తు చేసుకోగా 2900 మందికి రూ.3 కోట్ల వరకు రుణాలు అందించారు. ప్రస్తుతం కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 90 మంది అర్హులను గుర్తించగా, వారిలో 25 మందికి రుణాలు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు.
రెండు విడతలుగా శిక్షణ
వీధి వ్యాపారులకు రెండు విడతలుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నాణ్యమైన ఆహార పదార్థాల వినియోగం, కల్తీ నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు కూడా జారీ చేస్తారు. బ్యాంకు అధికారులు, డిజిటల్ ఎగ్రిగేటర్లు, ఫుడ్‌సేఫ్టీ అధికారులు, ఎన్జీవోలు, వ్యాపారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పథకం కింద వీధి విక్రయదారులతోపాటు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పథకాల్లో లబ్ధి కల్పించడం ద్వారా సామాజిక భద్రత కల్పించనున్నారు. పీఎం సురక్ష బీమా యోజన, పీఎం జీవన జ్యోతి బీమా యోజన, పీఎం శ్రమ యోగి మాన్‌ధన్ యోజన, పీఎం జన్‌ధన్ యోజన, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, జననీ సురక్ష యోజన, భవన నిర్మాణ కార్మికుల నమోదు, పీఎం మాతృవందన యోజన తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు.
దరఖాస్తు చేసుకోవాలి
లోక్ కళ్యాణ్ మేళా(పీఎం స్వనిధి) కోసం కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు బ్యాంకుకు వెళ్లి వివరాలు సమర్పించాలి. పత్రాలన్నీ పరిశీలించిన అనంతరం రుణాలు మంజూరు చేస్తారు. పూర్తి వివరాలకు 9951716273 నంబర్‌తోపాటు జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయంలో సంప్రదించాలి.
– జాడి మోతీరాం, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్
ఆర్థికంగా చేయూత
వీధి వ్యాపారుల కుటుంబాల సామాజిక, ఆర్థిక వివరాలు సేకరించడం, వీధి విక్రేత సామర్థ్యాలను అభివృద్ధి చేయడంతోపాటు సంక్షేమ పథకాలతో ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పునఃరూపకల్పన చేసిన పీ ఎం స్వనిధి పథకం కింద కొత్తగా దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంజూరైన దరఖాస్తులకు రుణ పంపిణీ సులభతరం చేయ డం, బ్యాంకుల్లోని పెండింగ్ దరఖాస్తులను పరి ష్కరించడం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో వీధి ఆహార విక్రేత వ్యాపారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆహార పదార్థాలు విక్రయించే సమయంలో నాణ్యమైన ఆహార పదార్థాలు, కల్తీ లేకుండా వినియోగించడం తదితర అంశాలపై రెండు విడతలుగా వీధి వ్యాపారులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌లు సైతం మంజూరు చేస్తారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో బ్యాంకులు, టౌన్ వెండింగ్ కమిటీలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఎన్‌జీవోలు, విక్రేతల సంఘాలు, తదితర ఆర్గనైజేషన్లను భాగస్వాములను చేయనున్నారు.

చేయూత