సమ్మెబాట పట్టిన డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వంటకు తిప్పలు పలుచోట్ల విద్యార్థులతోనే పనులు
ఆసిఫాబాద్‌రూరల్/తిర్యాణి: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఏడు నెలలుగా వేతనాలు రావడం లేదు. దీంతో వారు విధులు బహిష్కరించి ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నారు. మరోవైపు వంట చేసేందుకు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెగ్యులర్ సిబ్బంది అధికారులు, విద్యార్థులతో కలిసి వంట పనులు చేస్తున్నారు. జిల్లాలో 48 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉండగా, ఇందులో 68 మంది డైలీవేజ్ వర్కర్లు, 282 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మొత్తం 450 మంది పనిచేస్తున్నారు. దాదాపుగా 11,560 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. హెడ్‌కుక్, కామటి, వాచ్‌మెన్ తదితర పనులు చేసే డైలీవేజ్ వర్కర్లకు రోజుకు రూ.619 చెల్లిస్తారు. ఇందులో ఏజెన్సీలో పనిచేసే వారికి నెలకు రూ.18 వేలు, నాన్ ఏజెన్సీ వారికి రూ.13,750, మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే వారికి రూ.15,000 అందుతున్నాయి. ఇక ఔట్‌సోర్సింగ్ కింద వసతిగృహాల్లో హెల్పర్, శానిటేషన్‌తోపాటు వాటర్, విద్యుత్, వాచ్‌మెన్ పనులు చేస్తున్న వారికి రూ.12వేలు చెల్లిస్తున్నారు.
హామీల అమలుకు డిమాండ్
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఏడు నెలలుగా వేతనాలు అందడం లేదు. 2023లో సమ్మె చేసిన సమయంలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోవడంతోనే సమ్మె చేపట్టినట్లు సిబ్బంది చెబుతున్నారు. 30 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నా తమకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2012లో విడుదల చేసిన జీవో సవరించి 2014 నాటికి ఐదేళ్ల సర్వీసు ఉన్నవారిని షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, కొత్త మెనూతో పెరిగిన పనిభారానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, ప్రతీ కార్మికుడికి రూ.10 లక్షల ప్రమాదబీమా, మరణించిన కార్మికుల కుటుంబంలోని ఒకరికి ఉద్యోగావకాశం, రిటైర్మెంట్ తర్వాత రూ.5 లక్షలు బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతున్నారు.
పండుగలోపు చెల్లించాలి
ఏడు నెలల నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కుటుంబ అవసరాలకు ఇబ్బందులు పడుతున్నాం. దసరా పండుగలోపు వేతనాలు చెల్లించి న్యాయం చేయాలి.
– రాంబాయి, డైలీవేజ్ వర్కర్, చెలిమెల
ఎలా బతకాలి..?
30 ఏళ్లుగా తిర్యాణి మండలంలోని మంగీ పాఠశాలలో పని చేస్తున్న. బడ్జెట్ లేదు అంటూ ఏడు నెలలుగా జీతాలు ఆపారు. మేము ఎలా బతకాలి.
– గిరుజుబాయి, మంగీ పాఠశాల
విద్యార్థులతో పనులు చేయించొద్దు
ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల సమస్యను ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్లాం. అవసరమైన చోట ప్రైవేట్ వ్యక్తులను నియమించాం. విద్యార్థులతో ఎలాంటి పనులు చేయించొద్దు.
– రమాదేవి, డీటీడీవో
విద్యార్థులతో వంట పనులు
సమ్మె కారణంగా రెగ్యులర్ సిబ్బంది, విద్యార్థులపై భారం పడుతోంది. ఎనిమిది, పది మంది చేయాల్సి పనిని ఇద్దరు, ముగ్గురే చేస్తున్నారు. వారం రోజులగా వంట పనులకు సైతం ఆటంకం కలుగుతోంది. పలుచోట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులే సిబ్బందికి సహకరిస్తున్నారు. విద్యార్థులతో పనులు చేయిస్తే చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తెలిపినా ఎక్కడా అమలు కాకపోవడం గమనార్హం.
వేతనాలు విడుదల చేయాలి
ఏళ్లుగా తక్కువ జీతానికి పనిచేస్తున్నా పర్మినెంట్ చేయలేదు. 12 నెలల వేతనం పూర్తిగా చెల్లించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలి. వేతనాలు వెంటనే విడుదల చేయాలి. – శశికళ,
ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ఆసిఫాబాద్
జీవో 64 రద్దు చేయాలి
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న వర్కర్లకు టైంస్కేల్ అమలు చేసి జీవో 64 రద్దు చే యాలి. కలెక్టర్ గెజిట్ ప్రకారం క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి. ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలి.
– కృష్ణమాచారి, వర్కర్స్ యూనియన్
(సీఐటీయూ) జిల్లా ఉపాధ్యక్షుడు
వేతన పోరాటం!
వేతన పోరాటం!
వేతన పోరాటం!
వేతన పోరాటం!
వేతన పోరాటం!