
నిజాంపై గోండు బెబ్బులి పోరు
జల్, జంగల్, జమీన్ నినాదంతో గిరిజన పోరాట యోధుడు కుమురంభీం నిజాం ప్రభుత్వంపై భీకర పోరు సాగించారు. అడవిపై హక్కులు, సామాజిక న్యాయం అందించాలని కెరమెరి మండలంలోని బాబేఝరి కేంద్రంగా గిరిజనులతో అడవి నరికి 12 పోరు గ్రామాలను ఏర్పాటు చేశారు. మేకల కోసం చెట్టు కొమ్మను కొట్టిన తన స్నేహితుడు పైకు చేతి వేళ్లను జంగ్లాత్ సేరేదార్ నరికించడం, ఆదివాసీ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు కుమురం భీంను తీవ్రంగా కలచివేశాయి. ద ట్టమైన అడవుల్లోని జోడేఘాట్ కేంద్రంగా దీంతో సైన్యంతో గెరిల్లా పోరాటం సాగించాడు. నిజాం నిరంకుశత్వం, అటవీశాఖ అధికారుల అరాచకాలపై ప్రజలను చైతన్యపరిచాడు. ప్రభుత్వం విధించే పన్నులు కట్టవద్దని పిలుపునిచ్చి అప్పటి ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించాడు. ఆయన మరణంతో అలజడి చెలరేగడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించి ఆదివాసీల కోసం అనేక చట్టాలు రూపొందించింది.