
మహిళలకు ఆరోగ్య పరీక్షలు
నేటి నుంచి వచ్చేనెల 2 వరకు వైద్యశిబిరాలు ప్రత్యేక నిపుణులతో పరీక్షలు, మందులు పంపిణీ సద్వినియోగం చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ సూచన
ఆసిఫాబాద్‌అర్బన్: వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. స్వాస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరిట బుధవారం నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు మహిళలకు వైద్య పరీక్షలు చేసేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. సెలవు దినాలను మినహాయించి మిగిలిన రోజుల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తూ పరీక్షలు చేయనున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే సిబ్బంది అక్కడికక్కడే మందులు సైతం అందించనున్నారు.
52 వైద్యశిబిరాలు
జిల్లాలోని 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, సామాజిక ఆస్పత్రుల్లో మహిళల కోసం ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. మూరుమూల గ్రామాల ప్రజలకు దూరభారం అయితే సబ్ సెంటర్లలోనూ వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తారు. అక్టోబర్ 2నాటికి రోజుకు నాలుగు చొప్పున మొత్తం 52 శిబిరాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళలకు గైనకాలజీ, కంటి, చెవి, ముక్కు, గొంతు, చర్మ, మానసిక, దంత సమస్యలపై మహిళా వైద్య నిపుణులతో పరీక్షలు చేస్తారు.
ఆరోగ్యంపై దృష్టి సారించేలా..
ప్రస్తుతం మహిళలు ఇంటి పనులు, వృత్తి పనులతో బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా జిల్లాలో గర్భిణులను రక్తహీనత వెంటాడుతోంది. వ్యాధి ముదిరిన తర్వాత ఆస్పత్రుల్లో చేర్పించినా ప్రయోజనం ఉండడం లేదు. నారీమణుల్లో ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వాస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌కు శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి, కంటి, దంత, చర్మ, చెవి, ముక్కు, గొంతు, ప్రసూతి, డెర్మటాలజీ, సైక్రియాట్రిస్ట్ వైద్య నిపుణులు సేవలందిస్తారు. బీపీ, మధుమేహం, క్యాన్సర్, టీబీ, హిమోగ్లోబిన్ లోపం పరీక్షలతోపాటు గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక పరీక్షలు చేస్తారు. అవసరమైన మందులు అక్కడికక్కడే అందిస్తారు. రక్తహీనత బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారంపై అవగాహన కల్పిస్తారు. క్షయ నిర్ధారణ అయితే వారికి కార్డులు అందిస్తారు. జిల్లాలో 15 మండలాల పరిధిలో అనేక ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సికిల్ ఏనిమియా పరీక్షలు నిర్వహించి నిర్ధారణ జరిగితే వైద్యం అందిస్తారు. జిల్లాలో ఇప్పటివరకు బీపీ 9వేలకు పైగా, షుగర్ 3వేలకు పైగా, క్యాన్సర్ బారిన పడిన మహిళలు సుమారు 50 మంది వరకు ఉంటారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. వైద్యశిబిరాలను జిల్లాలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.