
భీం వర్ధంతి ఘనంగా నిర్వహించాలి
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలం జోడేఘాట్‌లో అక్టోబర్ 7న గిరిజన పోరాటయోధుడు కుమురం భీం 85వ వర్ధంతి ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. జోడేఘాట్‌లో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఉత్సవ కమిటీ సభ్యులతో మంగళవారం వర్ధంతి, దర్బార్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ హట్టి నుంచి జోడేఘాట్ వరకు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. దర్బార్‌లో దరఖాస్తులు సమర్పించేలా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆదివాసీ గూడేల్లో నివాస గృహాలు, తాగునీటి కల్పన పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. పార్కింగ్ కోసం వినియోగించే వ్యవసాయ భూమికి పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జోడేఘాట్ విద్యార్థులు, స్థానిక ప్రజల అవసరాల కోసం పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా సభాస్థలి, పార్కింగ్, దర్బార్ స్థలాలను పరిశీలించారు. అంతకు ముందు భీం విగ్రహానికి నివాళులర్పించి, సమాధిపై పూలు చల్లారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్, డీడీ రమాదేవి, ఈఈ తానాజీ, అదనపు డీఎంహెచ్‌వో మనోహర్, పీవీటీజీ ఏపీవో మెస్రం మనోహర్, జీసీసీ మేనేజర్ తారాచంద్, భీం మనుమడు కుమురం సోనేరావు, కమిటీ సభ్యులు పెందోర్ రాజేశ్వర్, మడావి రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.