
యూరియా.. బారులు
రైతులకు తప్పని తిప్పలు బస్తాల కోసం తెల్లవారుజాము నుంచే నిరీక్షణ పలుచోట్ల ఆందోళనలు చేపట్టిన అన్నదాతలు
దహెగాం(సిర్పూర్): జిల్లాలోని రైతులకు యూరి యా కష్టాలు తప్పడం లేదు. బస్తాలు అందిస్తున్నారని తెలియగానే పంపిణీ కేంద్రాలకు తెల్లవారుజామునే పనులన్నీ వదులుకుని చేరుకుంటున్నారు. ఖాళీ కడుపుతో కార్యాలయం తెరవకముందు నుంచి క్యూలైన్లు కడుతున్నారు. జిల్లాలో 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. పత్తితోపాటు వరి పంటకు ఎరువులు వేసే సమ యం కావడంతో సోమవారం పలు మండలాల్లో అన్నదాతలు యూరియా బస్తాల కోసం బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టాల్సి వచ్చింది. దహెగాం పీఏసీఎస్సీలో రెండు లారీ లోడ్లు 800 బస్తాలు, గిరవెల్లి రైతువేదిక వద్దకు 800 బస్తాలు రాక రైతులు బారులు తీరారు. ముందుగా టోకెన్లు తీసుకున్నవారికి ఎకరానికి ఒకటి, రెండు బస్తాలు అందించారు.
పెంచికల్‌పేట్(సిర్పూర్): మండలంలోని ఎల్కపల్లి రైతువేదిక వద్ద యూరియా కోసం రైతులు క్యూలైన్‌లో బారులుతీరారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో రెండు లారీ లోడ్ల బస్తాలు రానున్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగా టోకెన్లు జారీ చేశారు.
రెబ్బెన(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని పీఏసీఎస్‌కు దాదాపు 2,200 యూరియా బస్తాలు వచ్చినా రైతుల ఆందోళనలు తగ్గడం లేదు. రైతువేదిక వద్దకు భారీ సంఖ్యలో రైతులు రాగా.. పాత టోకెన్లు పూర్తయ్యాక కొత్తవి జారీ చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించారు. పంటలు దెబ్బతింటుండగా అధికారులు బస్తాలు అందుబాటులో ఉంచుకుని టోకెన్లు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆగ్రహించిన అన్నదాతలు జాతీయ రహదారికి పైకి వచ్చి బైఠాయించారు. ఎస్సై వెంకటకృష్ణ కొత్త టోకెన్లు ఇప్పిస్తామని నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
స్టాక్ ఉన్నా తప్పని తిప్పలు
క్యూలైన్లలో జిరాక్స్‌లు
రెబ్బెన పీఏసీఎస్‌లో దాదాపు 2,200 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు ప్రకటించడంతో రైతులు తెల్లవారుజామునే రైతువేదిక వద్దకు చేరుకున్నారు. అధికారులు వచ్చేందుకు సమయం పట్టడంతో పట్టాపాస్ పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను క్యూలైన్లలో పెట్టి నిరీక్షించారు. అనంతరం టోకెన్ల వారీగా ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున అందించారు. ఎస్సై వెంకటకృష్ణ పంపిణీని పర్యవేక్షించారు.

యూరియా.. బారులు