
రెచ్చిపోతున్న ఇసుకాసురులు!
జిల్లాలో విచ్చలవిడిగా ఇసుక దందా సెలవు రోజుల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ తవ్వకాలు ఇతర జిల్లాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం విచ్చలవిడి తవ్వకాలతో వంతెనలకు పొంచి ఉన్న ముప్పు
రెబ్బెన మండలం గోలేటికి వెళ్లే దారిలోని పులికుంట వాగు వద్ద ఆదివారం కనిపించిన దృశ్యమిది. సెలవురోజున కూడా ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. అనుమతి ఉన్నా నిబంధనల ప్రకారం సెలవు రోజుల్లో తరలించేందుకు వీలుండదు. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.
తిర్యాణి(ఆసిఫాబాద్): జిల్లాలో కొద్దిరోజులుగా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా దొరికిందే అదనుగా ఇష్టానుసారంగా ఇసుక తోడేస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో అక్రమ రవాణా బహిరంగ రహస్యమే అయినా.. చర్యలు చేపట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా ‘మాములు‘గా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రకృతి అందాలకు నెలవైన జిల్లా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే పక్కనే ఉన్న మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు ఇసుక తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.
భారీ వర్షాలకు మేటలు
రెబ్బెన మండలం పులికుంట, లక్ష్మిపూర్, రాంపూర్, గంగాపూర్ వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని పెద్దవాగు, చీలాటిగూడ, భీంపూర్, తుంపెల్లి, చిర్రకుంట, కాగజ్‌నగర్ మండలంలోని అందవెల్లి, పెద్దవాగుల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నాణ్యమైన ఇసుక మేటలు వేసింది. దీనిని వ్యాపారంగా మలుచుకున్న కొంతమంది దళారులు సంబంధింత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిత్యం వందల ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. కొన్నిచోట్ల వాగులోని వంతెన పిల్లర్లను ఆనుకుని తవ్వకాలు సాగిస్తుండటంతో ప్రమాదం పొంచిఉంది. గతంలో అడ్డూఅదుపు లేని ఇసుక తవ్వకాలతోనే కాగజ్‌నగర్ మండలంలోని అందవెల్లి వంతెన పిల్లర్లు కుంగి బ్రిడ్జి కూలిపోయిందనే ఆరోపణలు వచ్చాయి.
సెలవు రోజుల్లో సైతం..
జిల్లాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. 6,736 ఇళ్లు మంజూరు కాగా, 2,420 ఇల్లు బేస్‌మెంట్ దశ దాటాయి. దీంతో జిల్లాలో ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. అధికారులు అడపాదడపా దాడులు చేస్తుండగా పలు ట్రాక్టర్లు పట్టుబడుతున్నాయి. అయినా దళారులు పట్టించుకోకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల పేరుతో లాభాల మత్తులో ఈ దందా కొనసాగిస్తున్నారు. గత వారం రెబ్బెన మండలం గోలేటికి వెళ్లే రోడ్డుకు ఆనుకుని ఉన్న పులికుంట వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా ఐదు ట్రాక్టర్లను స్థానిక తహసీల్దార్ పట్టుకున్నారు. వాటికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. అయినా మరుసటి రోజు నుంచే అక్కడ ఇసుక రవాణా యథావిధిగా కొనసాగుతుండటం గమనార్హం. దందా నడుస్తున్న తీరుకు ఇది అద్దం పడుతోంది.
అనుమతులు తప్పనిసరి
ఇసుక రవాణా కోసం సాధారణంగా రెవెన్యూ శాఖ నుంచి డీడీ రూపంలో నగదు చెల్లించి అనుమతి తీసుకోవాలి. ఒక వేళ సంబంధింత శాఖ నుంచి అనుమతి ఉన్నా అది కార్యాలయాల పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రవాణా చేయాలి. కానీ అక్రమార్కులు అవేమీ పట్టించుకోవడం లేదు. ఉదయం ఐదు గంటల నుంచే మొదలుకుని అర్ధరాత్రి దాటినా దందా సాగిస్తున్నారు. ఈ అక్రమ రవాణాలో ఓ పార్టీకి చెందిన పెద్దస్థాయి వ్యక్తి అండదండలు ఉండటంతో అక్రమ రవాణా అడ్డూఅదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. కాగా, ఈ విషయమై మైనింగ్ ఏడీ గంగధర్‌ను సంప్రదించగా ఆయన స్పందించలేదు.
దందా అరికట్టడంలో అధికారులు విఫలం
జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా దందాను అరికట్టడంలో జిల్లా అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం తీసుకెళ్తున్నామని చెప్పి ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. అధికారులు పట్టించుకోకుండా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. నామమాత్రంగా దాడులు చేస్తూ ఒకటి, రెండు ట్రాక్టర్లు పట్టుకుని చేతులు దులుపుకొంటున్నారు. – దుర్గం దినకర్,
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు

రెచ్చిపోతున్న ఇసుకాసురులు!