
జీపీవోలు వచ్చేశారు..!
ఆసిఫాబాద్: గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జిల్లాలో 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేసేందుకు 59 మంది గ్రామ పాలనాధికారులను నియమించింది. గ్రామస్థాయిలోని వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో వీఆర్వో, వీఆర్‌ఏలుగా పనిచేసిన ఉద్యోగులనే తాజాగా జీపీవోలుగా తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆసక్తి గల ఉద్యోగులకు అర్హత పరీక్షలు నిర్వహించగా, ఉత్తీర్ణులైన వారిని ఒక్కో క్లస్టర్‌కు ఒకరు చొప్పున నియమించనున్నారు. ఈ నెల 6న హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఎంపికై న గ్రామ పాలనాధికారులకు నియామక పత్రాలు అందించారు. జిల్లాకు 59 మంది అధికారులను కేటాయించగా, జిల్లా నుంచి 52 మంది, మంచిర్యాల నుంచి ఏడుగురిని కేటాయించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న 16 మంది ఉద్యోగులు కూడా ఎంపికయ్యారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పర్యవేక్షణలో జిల్లా నుంచి 52 మంది హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సుల్లో తరలివెళ్లి హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందుకున్నారు. త్వరలో వీరికి పోస్టింగ్ ఇవ్వకున్నారు. ఇక నుంచి జీపీవోలు గ్రామ రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా మారనున్నారు. భూభారతి చట్టంలో భాగంగా ప్రతీ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌లో వీరు సహాయకారిగా పని చేయనున్నారు. పల్లెల్లో సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపికపై విచారణ, ప్రభుత్వ, ప్రైవేటు భూములు, సర్వే నంబర్లు, చెరువులు, కుంటలు, శిఖం భూముతోపాటు పరిపాలన వ్యవహరాలన్నీ వీరే పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్ కేడర్‌లో జీపీవో పోస్టులను సృష్టించగా, వీరు 11 రకాల జాబ్‌చార్ట్ అనుసరించనున్నారు.
జిల్లాకు 59 మంది..
జిల్లాకు 59 మంది గ్రామ రెవెన్యూ అధికారులను కేటాయించారు. వీరిలో 52 మంది కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి, మంచిర్యాల నుంచి ఏడుగురు నియామకమయ్యారు. వీరికి క్లస్టర్లు కేటాయించాల్సి ఉంది.
– లోకేశ్వర్‌రావు, ఆర్డీవో, ఆసిఫాబాద్
పకడ్బందీగా విధులు నిర్వహిస్తా
ఏడాదిగా జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నా. జీపీవో నోటిఫికేషన్ రావడంతో పరీక్ష రాసి ఎంపికయ్యాను. గ్రామస్థాయిలో ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంతో పాటు భూభారతి చట్టం అమలుకు కృషి చేస్తా. గ్రామ పాలనాధికారిగా పకడ్బందీగా విధులు నిర్వర్తిస్తా.
– రాజు, జీపీవో, భూపాల్‌పల్లి
విధులు ఇవే..
గ్రామస్థాయిలో భూ ఖాతా నిర్వహణ, పహా ణిల నమోదు, రెవెన్యూ రికార్డుల నిర్వహణ తోపాటు అన్నిరకాల భూముల నిర్వహణ, మార్పులు చేర్పులు గ్రామ పాలనాధికారులే చేపట్టనున్నారు. వక్ఫ్‌బోర్డు, అసైన్డ్, దేవాదా య, లావణి భూముల నిర్వహణ చూస్తారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల కింద భూ ముల పరిరక్షణ, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, ఆక్రమణలపై ప్రభుత్వ యంత్రాంగం తీసుకునే చర్యలకు సహకరిస్తారు. భూ ముల ఖాతాల నిర్వహణ, మార్పులు, చేర్పు ల నమోదు. దరఖాస్తుదారులకు భూసర్వే సేవలు, ప్రకృతి విపత్తులు జరిగితే నష్టంపై అంచనా, గ్రామ స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపికలో విచారణ, జనన, మరణాల విచారణ, ఎన్నికల సమయంలో గ్రామ స్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. జిల్లాకు 59 మంది అధికారులను కేటాయించగా వారికి క్లస్టర్లు కేటాయించాల్సి ఉంది.

జీపీవోలు వచ్చేశారు..!