
తీరనున్న పేదోడి సొంతింటి కల
ఆసిఫాబాద్‌అర్బన్: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించింది. ఇచ్చిన నమూనా ప్రకారం ఇంటిని లబ్ధి దారులే నిర్మించుకోవాలని నిర్ణయించింది. ఇందు కు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ప్రభుత్వ సాయం అందించనున్నట్లు ప్రకటించింది. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసింది. ఈలెక్కన జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు 3,500 చొప్పున 7వేల ఇళ్లు మంజూరు కా వాల్సి ఉండగా ఇప్పటివరకు 6,736 మాత్రమే మంజూరయ్యాయి. లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూ రు పత్రాలు అందజేసింది. జిల్లాలో 4,918 ఇళ్ల నిర్మాణాలకు అధికారులు మార్కింగ్ చేశారు. గత నెలలో 925 ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. మొదట మంచి ముహూర్తాలు లేకపోవడం, నిబంధనలు కఠినంగా ఉండడంతో లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో అధికారులు లబ్ధి దారులకు అవగాహన కల్పించడంతో ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి నిర్మాణాలు ప్రారంభించారు. ముందుగా పనులు కొంత నెమ్మదించినా వెంటవెంట బిల్లులు వస్తుండడంతో లబ్ధిదారులు పనుల్లో వేగం పెంచారు. జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వం లబ్ధిదారులకు సుమారు రూ.24.16 కోట్ల బిల్లులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేసింది.
నిబంధనల ప్రకారమే నిర్మించాలి
జిల్లాలోని అర్హులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలి. నిర్మాణ దశల ప్రకారం ప్రభుత్వం వెంటవెంటనే బిల్లులు చెల్లిస్తోంది.
– వేణుగోపాల్, హౌసింగ్ పీడీ
జిల్లాలో ‘ఇందిరమ్మ’ వివరాలు
మంజూరైన ఇళ్లు 6,736
మార్కింగ్ చేసినవి 4,918
బేస్మెంట్ దశలో.. 2,420
స్లాబ్ దశలో.. 30
గోడల దశలో.. 116

తీరనున్న పేదోడి సొంతింటి కల