
‘నిఘా’ వైఫల్యం
● నేర పరిశోధనలో పెరిగిన సీసీ కెమెరాల ప్రాధాన్యత ● జిల్లాలో పనిచేయని నిఘా నేత్రాలు ● మరమ్మతులకు నిధులు లేక నిరుపయోగం
కౌటాల(సిర్పూర్): జిల్లాలో నేరాలు అదుపు చేసే లక్ష్యంతో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు మరమ్మతులు చేపట్టడం లేదు. వ్యాపార సముదాయాలు, ముఖ్య ప్రాంతాలు, రద్దీ ఏరియాల్లో నిఘా నేత్రాల ఉన్నా సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా ఫలితంగా నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరమ్మతులకు నిధులు లేకపోవడంతో నిరుపయోగంగా ఉంటున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రశాంతంగా ఉండే జిల్లాలో చోరీలు పెరిగాయి.
కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా..
మండల కేంద్రాలు, పట్టణాల్లోని కూడళ్లలో బిగించి న సీసీ కెమెరాలు స్థానిక పోలీస్ స్టేషన్‌తోపాటు జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి అనుసంధానించి ఉంటాయి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు చేసినవి నాణ్య తగా చిత్రీకరిస్తాయి. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భా గంగా జిల్లాలో దాదాపు 5 వేల వరకు వాణిజ్య స ముదాయాలు, ప్రైవేట్ వ్యక్తుల సాయంతో కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నాణ్యత లేకపోవడంతో తక్కువ కాలంలోనే అవి మరమ్మతులకు గురవుతున్నాయి. అభివృద్ధి పనులు, భారీ వర్షాలు, కోతుల కారణంగా కెమెరాలు, తీగలు దెబ్బతింటున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో వైర్లు తెగిపోయి పనిచేయడం లేదు.
పరిశోధనలో కీలకం..
చోరీలు, రహదారి ప్రమాదాలు, అక్రమ రవాణా తదితర ఘటనల్లో నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తున్నాయి. గతంలో నేరం జరిగినప్పుడు కేసు పరిష్కరించడానికి పోలీ సులు ఇబ్బంది పడేవారు. అనేక కోణాల్లో విచారణ చేపట్టేవారు. సీసీ కెమెరాలు వచ్చాక వారి పని సులువైంది. క్లిష్టమైన కేసులను సులువుగా త్వరగా పరిష్కరిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు లేకపోవడం పోలీస్ శాఖకు తలనొప్పిగా మా రింది. చాలాచోట్ల అవి పనిచేయడం లేదు. షాపుల ఎదుట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పలుమార్లు కేసులు చేధించారు. కానీ సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో చోరీ జరిగితే దొంగలను గుర్తించడం కష్టంగా మారుతుంది.
కరువైన పర్యవేక్షణ..
కమ్యూనిటీ పోలీసింగ్ కింద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా వాటి పర్యవేక్షణపై శ్రద్ధ చూపడం లేదు. ఆధునిక సాంకేతికతపై ఆధారపడిన పోలీసులకు కొన్ని సందర్భాల్లో నిందితులను పట్టుకోవడం కష్టమవుతోంది. మరికొన్ని సందర్భాల్లో సీసీటీవీలకు నిందితులు చిక్కినా.. నాణ్యత లేక వారి ముఖాలు గుర్తించడం సాధ్యం కావడం లేదు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
స్వచ్ఛందంగా ముందుకు రావాలి
ఇళ్లు, షాపులతోపాటు ఆలయాల సమీపంలో సీసీ కెమెరాలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలి. చోరీలు, ఇతర ఘటనలు జరిగినప్పుడు సీసీ కెమెరాల ఫుటేజీ కీలకంగా మారుతుంది. భారీ వర్షాలు, కోతల బెడదతో విద్యుత్ పరికరాలు పాడవుతున్నాయి. త్వరలోనే నిరుపయోగంగా ఉన్న సీసీ కెమెరాలను వినియోగంలోకి తెస్తాం. నిఘా నేత్రాల ఏర్పాటుకు పోలీస్ శాఖ వద్ద ప్రత్యేక నిధులు ఉండవు. వ్యాపారులు, ప్రజల సహకారంతో రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాం. 2 మెగా పిక్సెల్ కంటే ఎక్కువ నాణ్యత ఉండేవి బిగించుకునేలా అవగాహన కల్పిస్తాం.
– కాంతిలాల్ పాటిల్, ఎస్పీ

‘నిఘా’ వైఫల్యం