
పీఎంశ్రీతో వసతులు మెరుగు
● ప్రభుత్వ బడులకు ప్రత్యేక నిధులు ● సౌకర్యాల కల్పనకు పెద్దపీట ● అత్యుత్తమ పాఠశాలగా పెంచికల్‌పేట్ జెడ్పీ స్కూల్ ఎంపిక
ఆనందంగా ఉంది
అధికారులు పీఎంశ్రీలో పెంచికల్‌పేట్ ఉన్నత పాఠశాలను అత్యుత్తమ స్కూల్‌గా ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందింస్తున్నాం. డిజిటల్ బోధన ద్వారా నైపుణ్యాలు పెంపొందిస్తున్నాం. రానున్న రోజుల్లో పాఠశాలను మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం.
– విజయనిర్మల, హెచ్‌ఎం,
పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల, పెంచికల్‌పేట్
పెంచికల్‌పేట్(సిర్పూర్): ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడం, నాణ్యమైన విద్య అందించడానికి కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ(ప్రధాన మంతి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) పాఠశాలలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతోపాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ఢిల్లీలో పీఎంశ్రీ పాఠశాలలను జాతికి అంకితం చేశారు. జిల్లాలో 18 పీఎం శ్రీ పాఠశాలలు ఉండగా వీటిలో పెంచికల్‌పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను అత్యుత్తమ పాఠశాలగా అధికారులు ఎంపిక చేశారు.
బోధన ప్రత్యేకం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తు న్న పీఎంశ్రీ పాఠశాలల్లో వసతుల కల్పనకు ప్రత్యే క చర్యలు చేపడుతున్నారు. అదనపు తరగతుల నిర్వహణ, సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్స్, అటల్ థింకింగ్ లైబ్రరీ, కంప్యూటర్, ప్యానల్ ఆధారిత బోధన చేపడుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్యానల్స్, బొమ్మల ద్వారా బోధన చేపడుతూ విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవనాలు కల్పిస్తున్నారు. మరో వైపు విద్యార్థుల్లో పర్యావరణంపై ఆసక్తిని పెంచడానికి తోటల పెంపకం, నీటి సంరక్షణకు ఇంకుడు గుంత ల ఏర్పాటు, స్వచ్ఛత, మొక్కల పెంపకం, యూత్ ఎకో క్లబ్, సెల్ఫ్ డిఫెన్స్, సౌర విద్యుత్ దీపాల ఏర్పాటు చేశారు.
క్షేత్ర పర్యటనలతో అనుభవాలు..
తరగతి గదులతోపాటు విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభూతిని పెంపొందించడానికి క్షేత్ర పర్యటనలు చేస్తున్నారు. ఏటా ఫీల్డ్ ట్రిప్స్, ఎక్స్‌ఫ్లోజర్ విజిట్, సైన్స్, మ్యాథ్స్ యాక్టివిటీలు, పాఠశాల వార్షికోత్సవాలు, ట్విన్నింగ్ మోటివేషనల్ కార్యక్రమాలు నిర్వ హిస్తున్నారు. ఆధునిక పోటీ ప్రపంచంలో విద్యార్థులను తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పది డెస్క్‌టాప్ కంప్యూటర్ల ద్వారా డిజిటల్ బోధన చేస్తున్నారు. లైబ్రరీలో వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచి విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందిస్తున్నారు.
పెంచికల్‌పేట్ స్కూల్‌కు నిధులు
పీఎంశ్రీ పాఠశాలలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. ఆరు నుంచి పదో తరగతి వరకు మౌలిక వసతులు కల్పిస్తోంది. పెంచికల్‌పేట్ ఉన్నత పాఠశాలకు రూ.18,79,990 నిధులు విడుదల చేసింది. రూ.11.80లక్షలతో ల్యాబ్, లైబ్రరీ నిర్మాణం పూర్తి చేశారు. మిగతా నిధులతో పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అత్యుత్తమ పాఠశాలగా ఎంపిక చేయడంతో మరో రూ.15లక్షలు పాఠశాలకు అందనున్నాయి.