
● ఈసారి కూడా ఉచిత చేప పిల్లల పంపిణీ ఆలస్యమే.. ● టెండర్ల
టెండర్లు పిలవలేదు
జిల్లాలో మత్స్యకారులకు పంపిణీ చేయాల్సిన ఉచిత చేపపిల్లల సరఫరా కోసం ప్రభుత్వం ఇప్పటివరకు టెండర్లు పిలవలేదు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ చేపడుతుందని అనుకుంటున్నా. జిల్లాలో కొంతమంది మత్స్యకారులు ప్రైవేటుగా చేపపిల్లలు కొనుగోలు చేసుకుని చెరువుల్లో వదులుకుంటున్నారు. అయితే చాలా కొద్దిమంది మాత్రమే దూరప్రాంతాల నుంచి పిల్లలు కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం అందించే చేపపిల్లలు కూడా తీసుకుంటున్నారు.
– సాంబశివరావు,
జిల్లా మత్స్యశాఖ అధికారి
రెబ్బెన(ఆసిఫాబాద్): మత్స్యకారులు ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోంది. చె రువులు, కుంటల్లో పెంచి వాటి ద్వారా మత్స్యకారులు ఉపాధి పొందాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే లక్ష్యం ఉన్నతంగానే ఉన్నా అమలులో ఏర్పడుతు న్న జాప్యం మత్య్సకారుల పాలిట శాపంగా మారుతోంది. వర్షాకాలం సీజన్ దాదాపు ముగిసే సమయానికి ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు అందిస్తుండటంతో అవి సరైన సైజు పెరగక మత్స్యకారులు నష్టపోతున్నారు. సకాలంలో అందిస్తేనే ఉపయోగకరంగా ఉంటుందని మత్స్య పారిశ్రామిక సంఘాలు అధికారులకు మొరపెట్టుకున్నా తీరు మారడం లేదు. అసలే ఆలస్యం.. ఆపై చిన్నసైజు చేపపిల్లలు అందిస్తుండటంతో వాటిని తీసుకునేందుకు మత్స్యకారులు ఆసక్తి చూపడం లేదు. ఉచితం అనే ఒక్క కారణంగా బలవంతంగా తీసుకుని చెరువుల్లో విడుదల చేస్తున్నా ఆశించిన లాభం దక్కడం లేదు.
టెండర్లు ఏవి..?
జిల్లాలో 15 మండలాల పరిధిలో 72 మత్స్యపారిశ్రామిక సంఘాలు ఉండగా.. వాటిలో సుమారు 2800 మంది సభ్యులు ఉన్నారు. చేపల వేట, వాటి విక్రయంగా ద్వారా ఈ సంఘాల సభ్యులు ఉపాధి పొందుతున్నారు. చేపల పెంపకానికి జిల్లాలో 282 చెరువులను సంబంధిత శాఖ అధికా రులు గుర్తించారు. వాటిలో సుమారు 1.40 కోట్ల చేప పిల్లలను వదలాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఏ టా ప్రభుత్వం టెండర్లను పిలిచి కాంట్రాక్టర్ల ద్వారా మత్స్యకారులకు చేప పిల్లలు పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు దాటింది. గతేడాది సెప్టెంబర్ రెండో వారంలో చేప పిల్లలు పంపిణీ చేయగా ఈసారైనా కాస్త ముందు అందిస్తారని మత్స్యకారులు ఆశపడ్డారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు టెండర్లను కూడా పిలవలేదు. దీంతో ఈసారి కూడా పంపిణీ ప్రక్రియ ఆలస్యమయ్యేలా ఉందని వాపోతున్నారు. గతేడాది జిల్లా అధికారులు 1.20 కోట్ల చేప పిల్లల కోసం ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం 80లక్షల చేప పిల్లలకు మాత్రమే ఆమోదం తెలిపారు. సెప్టెంబర్ రెండోవారం కావడంతో చాలా మండలాల్లో మత్స్యకారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో జిల్లాలో 56లక్షల చేప పిల్లలను మాత్రమే అధికారులు అతికష్టం మీద పంపిణీ చేశారు.
రూ.లక్షలు పెట్టి కొనుగోలు
ఉచిత చేపపిల్లల పంపిణీ ఆలస్యమవుతుండటంతో మత్య్సకారులు సొంత ఖర్చులతో ప్రైవేటుగా కొనుగోలు చేసుకుంటున్నారు. ఆగస్టు వచ్చినా పంపిణీ ప్రక్రియ ప్రారంభించకపోవడంతో పలు మండలాల మత్స్యకారులు ఇప్పటికే చేపపిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో వదులుతున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే చేపపిల్లల సైజు సైతం చిన్నగా ఉంటున్నాయి. ఫలితంగా చెరువుల్లో నీరు తగ్గే సమయానికి ఒక్కో చేప అరకిలో వరకు కూడా బరువు పెరగడం లేదు. మత్స్యకారులు ఉచిత చేపపిల్లల కోసం ఎదురుచూడకుండా సొంతంగా డబ్బులు ఖర్చు చేసి పక్క రాష్ట్రం నుంచి తీసుకువచ్చి చెరువుల్లో వదులుతున్నారు. ఇప్పుడు వదిలిన చేపపిల్లలను ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేటాడుతారు. ఒక్కో చేప గరిష్టంగా 2.5 కిలోల బరువు తూగుతుంది. దీంతో మత్స్యకారులకు లాభం వస్తుంది. అదే ప్రభుత్వం అందించిన చేపపిల్లలు గరిష్టంగా కిలో బరువు కూడా పెరగకపోవడంతో ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని మత్స్యకార సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు.

● ఈసారి కూడా ఉచిత చేప పిల్లల పంపిణీ ఆలస్యమే.. ● టెండర్ల