
బాలికల గురుకులంలో చొరబడిన నలుగురి అరెస్ట్
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో బుధవారం అర్థరాత్రి అక్రమంగా చొరబడి విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేసిన నలుగురిని శుక్రవారం తాళ్లగురిజాల పోలీసులు అరెస్ట్ చేశారు. తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామానికి చెందిన దుగుట సంజయ్, కోనూరి కిరణ్, కన్నెపల్లి మండలం చర్లపల్లి, ఎల్లారం గ్రామాలకు చెందిన గొల్లపల్లి కిరణ్, కొజ్జన కిరణ్ మద్యం మత్తులో బాలికల గురుకుల విద్యాలయంలో అక్రమంగా చొరబడ్డారు. కేకలువేస్తూ, బూతులు తిడుతూ విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేశారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా కోనూరి కిరణ్ పట్టుబడగా ముగ్గురు పారిపోయారు. అక్రమంగా విద్యాలయంలో చొరబడిన ఘటనపై విద్యాలయ ప్రిన్సిపాల్ నిరుపమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. మద్యం, గంజాయి మత్తులో యువత ఇష్టారీతిన వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి వేళ అనుమానాస్పదంగా తిరిగి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. రాత్రి వేళ గస్తీ, భద్రతను ముమ్మరం చేసినట్లు తెలిపారు.