
అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య
కాసిపేట: మండలంలోని దేవాపూర్ ప్రసన్నాంజనేయనగర్‌కు చెందిన గంగాధరి వాణి(44) అనే మహిళ అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం దేవాపూర్‌కు చెందిన శంకర్‌తో వాణి వివాహం జరిగింది. కొంతకాలంగా శంకర్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో వాణి టైలరింగ్ పని చేస్తూ ఇంటి భారాన్ని మోసింది. తనకు వచ్చే డబ్బులు సరిపోకపోవడం, అప్పులు ఉండడంతో మనోవేదనకు గురై ఈనెల 6న మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. గమనించిన భర్త వెంటనే గ్రామంలోని కంపెనీ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. పరిస్థితి విషమించగా కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తుండగా రాత్రి మృతిచెందింది. మృతురాలికి 11 ఏళ్ల కొడుకు విజ్ఞతేజ్ ఉన్నాడు. మృతురాలి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అనారోగ్యంతో ఒకరు..
రెబ్బెన: అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది మండలంలోని నంబాలకు చెందిన రత్నం నారాయణ (47) శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే నారాయణ పదేళ్లుగా షుగర్‌తో బాధ పడుతున్నాడు. ఇటీవల మరికొన్ని అనారోగ్య సమస్యలు తోడయ్యాయి. అనారోగ్య సమస్యలు భరించలేక చనిపోవాలని ఉందని తరచూ కుటుంబ సభ్యులతో చెబుతూ బాధపడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి తనకు అస్వస్థత ఉన్నట్లు భార్య ప్రమీలకు తెలిపాడు. వెంటనే కుటుంబ సభ్యులు నారాయణను రెబ్బెన పీహెచ్‌సీకి తరలించారు. ప్రఽథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తమ్ముడు మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ మృతి
వాంకిడి: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇందాని గ్రామానికి చెందిన చాప్లే వెంకటేశ్ (30) కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. దీంతో కడుపు నొప్పి వచ్చినప్పుడల్లా మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 3న సాయంత్రం మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోగా బుధవారం ఇంటికి తీసుకువచ్చారు. కాగా, గురువారం సాయంత్రం అస్వస్థతకు గురైన అతడిని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య లలిత, ముగ్గురు కూతుళ్లు, కుమారుడున్నారు. అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
జన్నారం: జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగిన వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై అనూష తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రోటిగూడకు చెందిన గాలి నాగేశం (40) రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్లి పని దొరకక ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చడానికి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. అయినా అప్పు తీరకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 5న మద్యం మత్తులో గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య విజయ, కూతురు, కొడుకు ఉన్నారు. విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.