
అడవి బిడ్డలు.. సంస్కృతి రక్షకులు
● సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ● యాస.. భాష పరిరక్షణకు చర్యలు ● భావితరాలకు అందించే యత్నం ● నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ఇంద్రవెల్లి/ఉట్నూర్‌రూరల్: సంస్కృతి, సంప్రదాయాలకు ఆదివాసీ గిరిజనులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొండ, కోనల నడుమ ప్రకృతితో మమేకమవుతున్నారు. ప్రకృతిని దైవంగా భావించి జీవనం సాగిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార, వ్యవహారాలను పాటిస్తూ వాటిని భావితరాలకు అందిస్తున్నారు. ఏ పని చేసినా, ఈ కార్యం తలపెట్టినా ముందుగా ప్రకృతి దేవతలకు పూజలు చేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. వనదేవతలకు పూజలు చేశాకే సాగు పనులు ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలాం, తోటి, నాయక్‌పోడ్, గోండు, పర్ధాన్, అంధ్, లంబాడీ తెగలుగా ఉన్న ఆదివాసీ గిరిజనులు ప్రతీ పండుగ, కుల దేవతల పూజలు, పెళ్లి వేడుకలు ఇలా ఏవైనా వారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా వైభవంగా నిర్వహిస్తారు.
ఆదివాసీ తెగలు.. పండుగలు
గోండు, కొలాం, పర్ధాన్, తోటి ఆదివాసీ తెగలవారు కుల దేవతలతోపాటు ప్రకృతి దేవతలను ఆరాధిస్తారు. ఏ పూజ చేసినా.. తరతరాలుగా గ్రామస్తులంతా సామూహికంగా చేసే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆషాఢ మాసం ప్రారంభంలో అకాడి (వన దేవత) పూజలతో మొదలుకుని నాలుగు నెలలపాటు యేత్మసుర్ దేవతలను ఆరాధిస్తారు. శ్రావణ మాసానికి ముందు గావ్ సాత్ పేరుతో పోచమ్మ తల్లికి పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో నెలపాటు గ్రామ దేవతలు శివ బోడి, నొవోంగ్ పూజలను ఘనంగా నిర్వహిస్తారు. దీపావళి సందర్భంగా యేత్మసుర్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గుస్సాడీ వేషధారణలతో వారంపాటు సంప్రదాయ వాయిద్యాల మధ్య డండారీ ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. వైశాఖ, పుష్య మాసాల్లో సంవత్సరానికి రెండుసార్లు కులదేవతలైన జంగుబాయి, పెర్సాపేన్, భీందేవుడి పూజలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు. పుష్యమాసంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన, రాష్ట్రంలో రెండో పండుగైన నాగోబా మహాపూజ, నాగోబా జాతరను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మెస్రం వంశీయులు ఘనంగా నిర్వహిస్తారు. అంద్ సమాజ్ ఆదివాసీలు తమ కులగురువు శ్రీశ్రీ సంత్ సద్గురు పులాజీబాబాను ఆరాధిస్తారు. వారివారి గ్రామాల్లో నిర్మించిన ధ్యాన్ మందిరాల్లో ప్రతీ సంవత్సరం వార్షికోత్సవ పూజలు చేస్తారు. నాగుల పంచమి మరుసటిరోజు శీరల్ దేవత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అంధ్ ఆదివాసీ సమాజ్ వారి వివాహాలు పులాజీబాబా ధ్యాన్ మందిరాల్లో సామూహికంగా జరిపిస్తారు. నాయక్‌పోడ్ ఆదివాసీ భీమన్న దేవుడిని ఆరాధ్యదైవంగా కొలిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లంబాడా గిరిజనులు కులగురువు సంత్ సేవలాల్ మహరాజ్‌ను ఆరాధించడంతో పాటు ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి తరువాత వారంపాటు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. ప్రతిరోజూ గ్రామాల్లోని ఆలయాల్లో సేవాలాల్, జగదాంబదేవిని ఆరాధిస్తారు.
యాస.. భాషకు డిజిటల్ రూపం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు మాట్లాడే యాస.. భాష.. సంస్కృతిని డిజిటల్ రూపంలో భద్రపర్చడానికి బోలి చేతో (భాష–చైతన్యం) ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు చెరిగిపోకుండా భావితరాలకు అందించడానికి గోండి, కొలామీ భాషలో వికీపీడియా, విక్షనరీలను అంతర్జాలంలో భద్రపర్చి భావితరాలకు భాష, సాహిత్య సంపదను అందించడానికి కార్యశాల నిర్వహిస్తూ ఆదివాసీ యువకులను ప్రోత్సహిస్తోంది. – ఆత్రం మోతీరాం,
బోలిచేతో ఫౌండేషన్ బోర్డు సభ్యుడు
వాయిద్యాలు.. ప్రత్యేకతలు
గోండులు పెర్స్‌పెన్ పండుగలో దండారీ డప్పు ల దరువులతో తుడుం వాయిద్యాన్ని నిర్వహిస్తుంటారు. కొలాంలు పోలకమ్మ పండుగ, భీమయ్యక్ ఉత్సవం (సట్టి దెయ్యాల్), దండారీ, దసరా పండుగల్లో మోగిస్తుండగా, గోండులు జంగుబాయి, పెర్స్‌పెన్, దండారీ ఉత్సవాల్లో తుడుంను డోలుకు సహ వాయిద్యంగా మోగిస్తుంటారు. అలాగే డెంసా నృత్యాలు చేస్తుంటారు. ఆదివాసీ లకు ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతి, సంప్రదాయాలు వారసత్వంగా వస్తున్నాయి. తుడుంను పురుషవాద్యంగా భావిస్తారు. ఈ సంగీత వాద్యాన్ని పూజా కార్యక్రమంలో ఉంచి పూజిస్తారు. ఆదివాసీల చైతన్యానికి ‘తుడుం’ ఒక సంకేతంగా నిలిచింది. ఆదివాసీ ఉద్యమాల్లో ర్యాలీ, ధర్నా లాంటి నిరసన కార్యక్రమాల్లో ‘తుడుం’ మోగిస్తుంటారు. గోండి పూజారులైన ప్రధాన్లు, తోటి తమ తెగ ఆచారాన్ని పాటిస్తూ జరిపే మత క్రతువులు, కర్మకాంఢలు, వివాహాలు, చావుల సందర్భంలో దీనిని వాయిస్తారు. గోండి సంప్రదాయాలు, గౌరవానికి ఇది సంకేతం. కిక్రితో పాటు ‘పెప్రే’ అనే రెండు సన్నాయి వాయిద్యాలు, డక్కి అనే చర్మవాయిద్యం అన్నీ కలిసి సామూహికంగా వాయిస్తారు. డోలు లేని ఆదివాసీ ఊరు ఉండదు. డోలు వాయిద్యానికి ప్రత్యేకమైన జానపద గేయాలు, నృత్యాలు ఉంటాయి. హోలీ, వివాహ వేడుకలకు డోలు నృత్యాలతో కళాకారులు అలరిస్తుంటారు. ఆదివాసీ వ్యక్తి మరణిస్తే అతని దహన సంస్కారాల సందర్భంగా దీనిని వాయిస్తారు. డోలును వివాహ వేడుకల సందర్భంగా రాత్రి వేళ నృత్యాలు చేయడానికి వినియోగిస్తుంటారు. ఒక్కో సందర్భంలో ఒక గ్రామంతో మరో గ్రామం మధ్య పాటల పోటీలు జరుగుతుంటాయి. డోలు వాయిస్తూ పురుషులు సీ్త్ర వేషధారణలో, ఒకరు జోకర్‌గా నృత్యాలు చేస్తుంటారు.

అడవి బిడ్డలు.. సంస్కృతి రక్షకులు

అడవి బిడ్డలు.. సంస్కృతి రక్షకులు