
ప్రభుత్వ బడుల్లో ‘ప్రీ ప్రైమరీ’
● నాలుగేళ్లు నిండిన పిల్లలకు అవకాశం ● జిల్లాలో 41 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక ● ఆగస్టు 15 నుంచి తరగతులు ప్రారంభం!
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై దృష్టి సారించిన రాష్ట్ర సర్కారు సరికొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏఐ బోధనతోపాటు ఇక నుంచి ప్రీప్రైమరీ పాఠశాలల నిర్వహణకు మార్గదర్శకాలు విడుదల చేసింది. మొదటి దశలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించనున్నారు. రానున్న 2026– 27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా నాలుగేళ్లు పైబడిన చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించనున్నారు.
జిల్లాలో 41 ప్రీ ప్రైమరీ పాఠశాలలు
జిల్లాలో మొదటి విడతలో 16 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య కోసం ఎంపిక చేయగా, రెండో విడతలో 25 స్కూల్స్‌ను ఎంపిక చేశారు. మొత్తం 41 ప్రీ ప్రైమరీ పాఠశాలల పరిధిలో నాలుగేళ్ల వయస్సు నిండిన విద్యార్థులు 400 మంది ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఆగస్టు 15 నుంచి పూర్వ ప్రాథమిక విద్య తరగతులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా ప్రీప్రైమరీ పాఠశాల నిర్వహణకు పాఠశాల ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయులు ఒక ప్రత్యేక తరగతి గదిని కేటాయించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. గాలివెలుతురు సక్రమంగా ఉండటంతోపాటు ఫర్నీచర్ అందుబాటులో ఉంచాలి. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, ఆకర్షణీయంగా గదిని తీర్చిదిద్దాలి. చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా లోపల, బయట సరైన ఆట వస్తువులు అందుబాటులో ఉంచాలి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు సమన్వయంతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సర్కారు సూచించింది.
యూడైస్‌లో వివరాలు నమోదు..
ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో నాలుగేళ్లు నిండిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. అడ్మిషన్ సమయంలో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్నారుల వయస్సు, నివాస ధ్రువపత్రాలు తీసుకోవాలి. వివరాలను సంబంధించి రిజిస్టర్‌లో నమోదు చేసిన వెంటనే యూడైస్ పోర్టల్‌లోనూ అప్‌లోడ్ చేయాలి. అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు, ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులను గుర్తించాలి. ప్రీ ప్రైమరీ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో అడ్మిషన్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రీ ప్రైమరీ స్కూల్ నిర్వహణకు టీచర్, రెండు ఆయా పోస్టులను మంజూరు చేశారు. కలెక్టర్ అధ్యక్షతన అదనపు కలెక్టర్(వైస్ చైర్మన్) డీఈవో (కన్వీనర్)తో కూడిన జిల్లా కమిటీ పర్యవేక్షణలో వీరిని ఎంపిక చేయనున్నారు.
అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం