
● జిల్లాలో పెరుగుతున్న పాముకాట్లు ● సకాలంలో వైద్యం అందక
రెబ్బెన మండలం గొల్లగూడకు చెందిన మొగిలి చిన్నన్న, అనసూయ దంపతుల కుమారుడు శ్యాం(4) గత నెల 29న తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నేలపై పడుకున్నాడు. ఈ క్రమంలో రాత్రి శ్యాం చెవిపై పాముకాటు వేసింది. తల్లిదండ్రులు బైక్‌పై రెబ్బెన పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. బెల్లంపల్లికి, అక్కడి నుంచి మంచిర్యాలకు అంబులెన్స్‌లో తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
కౌటాల మండలం మొగడ్‌ధగడ్‌కు చెందిన ఉర్వత్ నాందేవ్(55) ఈ నెల 1న భార్య
నిర్మలతో కలిసి గ్రామశివారులోని పంట పొలానికి వెళ్లాడు. పొలం పనులు చేస్తుండగా పాముకాటు వేసింది. గమనించిన భార్య వెంటనే సిర్పూర్–టి సామాజిక ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆసిఫాబాద్/కౌటాల: జిల్లాలో విషసర్పాలు కలవరపెడుతున్నాయి. వర్షాలకు పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగడంతో ఇళ్ల ఆవరణతోపాటు పాఠశాలలు, వసతి గృహాల్లో పాములు సంచరిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులకు వెళ్లేందుకు అంబులెన్సులు అందుబాటులో లేక సకాలంలో వైద్యం అందడం లేదు. పాముకాటుతో జిల్లాలో ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లావ్యాప్తంగా సర్పాల సంచారం పెరగగా, కొంతమంది కనిపించిన వెంటనే చంపుతున్నారు. మరికొందరు స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇచ్చి పట్టించి సురక్షితంగా అడవుల్లో వదిలిపెడుతున్నారు.
విధిలేని పరిస్థితుల్లోనే..
పాముల్లో విషపూరితం, విషపూరితం కానివి ఉంటాయి. చాలావరకు సర్పాలు ఆత్మరక్షణ కోసం విధిలేని పరిస్థితుల్లో కాటువేస్తుంది. తాచు, కట్లపాముల వంటి 15 శాతం సర్ప జాతులతోనే ప్రమాదం ఉంటుంది. అన్ని పాముకాట్లు ప్రమాదకరమైనవి కాదు. సాధారణంగా 50 శాతం పాముకాట్లు విషంలేనివే ఉంటాయి. వీటికి సాధారణ చికిత్స తీసుకుంటే చాలు. ఒకవేళ విషపూరిత పాము కాటువేస్తే ఆందోళనకు గురికాకుండా తక్షణమే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేసుకోవాలి. ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాగే చాలామంది షాక్‌కు గురవుతుంటారు. ఇలాంటి సమయంలో వారికి ధైర్యం చెప్పాలి.
అందుబాటులో మందులు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రితోపాటు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో యాంటి వీనమ్ మందులు అందుబాటులో ఉన్నాయి. బాధితులు గాయాన్ని వెంటనే సబ్బుతో శుభ్రంగా కడగాలి. వీలయినంత త్వరగా ఆస్పత్రికి తరలించి చిక్సిత అందించాలి. నాటువైద్యం అందిస్తే ప్రాణాలకే ప్రమాదం. పాము, తేలు, ఇతర విషపురుగులపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.
– సీతారాం, డీఎంహెచ్‌వో
31 మందికి పాముకాటు
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 31 మంది పాముకాటుకు గురయ్యారు. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 176 యాంటి వీనమ్ టీకాలు, ఐదు సీహెచ్‌సీల్లో 40 యాంటి వీనమ్ టీకాలు అందుబాటులో ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. గత నెల నుంచి ఇప్పటివరకు 30 విష విరుగుడు టీకాలు వినియోగించారు. చాలామంది సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. గత నెల 29న రాత్రి రెబ్బెన మండలంలో ఓ బాలుడు, కౌటాల మండలం మొగడ్‌ధగడ్‌కు చెందిన రైతు పాముకాటుతో ప్రాణాలు కోల్పోయారు. జైనూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సిడాం కన్నీబాయి గత వారం పాముకాటుకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆటోలో జైనూర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యసిబ్బంది సూచనల మేరకు ఆదిలాబాద్‌కు తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది. కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన దుర్గం ప్రియత(26) మే 16న ఇంటి ఆవరణలో పని చేస్తుండగా పాముకాటు వేసింది. కుటుంబ సభ్యులు వెంటనే కాగజ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందింది. పీహెచ్‌సీల్లో రాత్రిపూట వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది. ఆధునిక కాలంలోనూ గిరిజనులు, గ్రామీణ ప్రజలు నాటువైద్యాన్ని నమ్ముకోవడం ప్రమాదకరంగా మారుతోంది. పాము కరిచినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణాల మీదకు వస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోయినా, భయాందోళనతో గురైనా తీవ్రత మరింత పెరుగుతుంది.