
ఇక పక్కాగా హాజరు!
● ఉపాధ్యాయులకు ముఖ గుర్తింపు హాజరు షురూ ● రోజుకు రెండుసార్లు అటెండెన్స్ వేయాల్సిందే..
కెరమెరి(ఆసిఫాబాద్): జిల్లాలో ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరు(ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్) ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 1 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు డీఎస్‌ఈ– ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను మొబైళ్లలో డౌన్‌లోడ్ చేసుకుని ఆన్‌లైన్ ద్వారా హాజరు వేస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లుగా ఉపాధ్యాయులు ట్యాబ్‌లు, మొబైల్ ద్వారా విద్యార్థుల హాజరు నమోదు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం ఎఫ్‌ఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది 2,458 మంది ఉండగా.. ఆదివారం వరకు 1,978 మంది(80.47 శాతం) రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు విధులకు డుమ్మా కొడుతూ సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో విద్యాశాఖ ముఖ గుర్తింపు హాజరుకు శ్రీకారం చుట్టింది.
గతంలో బయోమెట్రిక్..
ప్రభుత్వ టీచర్లకు గతంలో బయోమెట్రిక్ ద్వారా హాజరు అమలు చేశా. కరోనా విస్తరించడంతో ఆ విధానం మరుగున పడింది. జిల్లాలో 2022లో బయోమెట్రిక్ విధానం అందుబాటులోకి రాగా, కొన్నిరోజులు మాత్రమే కొనసాగింది. ఉపాధ్యాయులకు ప్రత్యేక ఐడీలతో వేలిముద్ర ద్వారా హాజరు వేసేవారు. ఆ తర్వాత సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఉపాధ్యాయుల సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో ఆ విధానాన్ని నిలిపివేశారు.
రోజుకు రెండుసార్లు..
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం రూ.కోట్ల నిధులు ఖర్చు చేస్తోంది. కొంతమంది ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరవుతూ సొంత పనులు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ముఖగుర్తింపు హాజరుకు మొగ్గు చూపింది. ఈ విధానం ద్వారా ఉదయం 9 గంటలకు పాఠశాల ఆవరణలోనే ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌లో హాజరు నమోదు చేయాలి. మళ్లీ సాయంత్రం 4 గంటలకు స్కూల్ ముగింపు సమయంలో మళ్లీ హాజరు వేయాలి. నిర్ణీత సమయానికి తప్పనిసరిగా పాఠశాలలోనే యాప్‌ను ఆన్‌చేసి లొకేషన్ ద్వారా అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది.
అనధికార గైర్హాజరుకు అవకాశం ఉండదు
ఉపాధ్యాయులు యాప్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వందశాతం రిజిస్ట్రేషన్‌కు సహకరించాలి. ముఖ గుర్తింపు హాజరుతో ఉపాధ్యాయుల హాజరు పెరిగి, విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. టీచర్ల అనధికార గైర్హాజరుకు అవకాశం ఉండదు. స్థానిక సంస్థల పరిధిలో పనిచేస్తున్న స్కూళ్లతోపాటు యూఆర్‌ఎస్, కేజీబీవీలు, మోడల్ పాఠశాలల్లో టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్ తప్పనిసరిగా ఎఫ్‌ఆర్‌ఎస్ వేయాలి.
– అబిద్ అలీ, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్
జిల్లాలో పాఠశాలలు, ఉపాధ్యాయుల వివరాలు
మార్పు వచ్చేనా..?
ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తు న్న కొందరు టీచర్లతో విద్యాశాఖకు చెడ్డ పేరు వస్తుందని విద్యాశాఖ భావిస్తుంది. రూ.వేలల్లో వేతనం పొందుతూ అనధికా రికంగా విధులకు గైర్హాజరవుతున్నారు. మరికొందరు రిజిస్టర్‌లో సంతకం చేసిన తర్వాత సొంత పనులకు వెళ్తున్నారే ఆరో పణలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్న వారైతే ఒప్పందం ప్రకారం ఒకరు విధులకు వెళ్లి, మరొకరు డుమ్మా కొట్టడం వంటి ఘటనలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ అమలు చేస్తున్న ముఖ గుర్తింపు హాజరుతో మార్పు వస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఇక పక్కాగా హాజరు!